సూర్య సరసన పూజా హెగ్డే

బన్నీ సరసన ఇప్పటికే రెండు సినిమాలు చేసింది పూజా హెగ్డే. ముందుగా దువ్వాడ జగన్నాధమ్ అనే సినిమా చేస్తే అది హిట్ అనిపించుకుంది. రీసెంట్ గా అల వైకుంఠపురములో సినిమా చేస్తే అది ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇలా బన్నీకి బ్రహ్మాండంగా కలిసొచ్చిన పూజా హెగ్డే, ఇప్పుడు తన గోల్డెన్ టచ్ ను తమిళ హీరో సూర్యకు అందించబోతోంది.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే సూర్య సరసన హీరోయిన్ గా నటించబోతోంది పూజా హెగ్డే. లాక్ డౌన్ కంటే ముందే ఈ మేరకు స్టోరీ సిట్టింగ్స్ పూర్తయ్యాయి. త్వరలోనే హరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు సూర్య. వీళ్లిద్దరిది సూపర్ హిట్ కాంబో అనే విషయం తెలిసిందే. సింగం సిరీస్ వీళ్లదే. కాకపోతే తాజా ఫ్రాంచైజీ ఫ్లాప్ అవ్వడంతో సింగం సిరీస్ ను వీళ్లు పక్కనపెట్టేశారు.

ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి మరో ఫ్రెష్ మూవీకి శ్రీకారం చుట్టారు. ఆ మూవీలో పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. పూజాకు తెలుగులో మంచి పాపులారిటీ ఉంది. అందుకే పూజాను తీసుకోవాలని సూర్య ఫిక్స్ అయ్యాడు. అటు సూర్య సినిమాలో నటిస్తే కోలీవుడ్ లో కూడా పాపులర్ అవ్వొచ్చనేది పూజా ఆలోచన. అలా ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది.