బన్నీ సినిమా పని మొదలైంది

కరోనా కారణంగా లాక్ డౌన్ అవ్వడంతో టాలీవుడ్ స్తంభించిపోయిందని అంతా అనుకుంటున్నారు. కేవలం రిలీజెస్ మాత్రమే ఆగాయి. కొత్త సినిమాల ప్రీ-ప్రొడక్షన్ పనులు మాత్రం ఆగలేదు. ఇంకా చెప్పాలంటే అవి మరింత శరవేగంగా సాగుతున్నాయి. మొన్నటికిమొన్న 18-పేజెస్ సినిమాకు సంబంధించి ఆన్ లైన్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ నిర్వహించారు. ఇప్పుడు ఇదే బాటలో సుకుమార్ కూడా నడుస్తున్నాడు.

తన కొత్త సినిమాకు సంబంధించి దేవిశ్రీప్రసాద్ తో కలిసి ఆన్ లైన్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశాడు సుకుమార్. సినిమాలో సన్నివేశం, సందర్భం ఏంటనేది ముందుగానే ఫోన్ లో బ్రీఫింగ్ ఇచ్చిన సుకుమార్.. దేవిశ్రీ నుంచి ట్యూన్స్ రాబట్టుకుంటున్నాడు. ట్యూన్స్ కంపోజ్ చేసి, వాటిని సుక్కూకు వాట్సాప్ చేస్తున్నాడు దేవిశ్రీ. ఇలా వీళ్లిద్దరి మధ్య జోరుగా మ్యూజిక్ సిట్టింగ్స్ సాగుతున్నాయి.

బన్నీ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే ఆలస్యమైంది. కరోనా కారణంగా కేరళ షెడ్యూల్ కూడా కాన్సిల్ అయింది. కరోనా తగ్గిన తర్వాత అదే షెడ్యూల్ ను మామిడిమిల్లి అటవీప్రాంతంలో జరపాలని నిర్వహించారు. ఈ గ్యాప్ లో కనీసం 3 ట్యూన్స్ అయినా ఫైనలైజ్ చేయాలని చూస్తున్నాడు సుకుమార్.