ఆంధ్రప్రదేశ్ లో 40 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

అనుకున్నట్టుగానే సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. ముప్పు పెరుగుతోంది. అప్రమత్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా ప్రభావం పెరుగుతోంది. నేటికి పాజిటివ్ కేసులు 40 వరకు చేరినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం లోపు కొత్తగా 17 కేసులు నమోదైనట్టు సాక్షాత్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారిక లెక్కలే చెబుతున్నాయి. పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి.

కరోనా పాజిటివ్ గా నమోదైన కొత్త కేసుల్లో… ఎక్కువ మంది ఢిల్లీలో మతపర ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే ఉన్నారని ప్రభుత్వం గుర్తించినట్టు తెలుస్తోంది. మొత్తంగా 711 మంది రాష్ట్రం నుంచి ప్రార్థనలకు వెళ్లి వచ్చారని నిర్థారణకు వచ్చినట్టు సమాచారం. ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏపీకి చెందిన వారైనా సరే.. ఇతర ప్రాంతాల నుంచి వస్తే రాష్ట్రంలోకి అనుమతించడం లేదు.

ఎవరైనా సరే.. క్వారంటైన్ కు అంగీకరిస్తేనే రానిస్తామని స్పష్టం చేస్తోంది. తాజా పరిస్థితుల్లో ఈ నిబంధనలు మరింత కఠినంగా అమలు కానున్నాయి. జిల్లాల సరిహద్దులు మూసేయాలని, రాష్ట్రాల సరిహద్దులు మూసేయాలని కేంద్రం కూడా ఆదేశాలు ఇవ్వడం, అమలు బాధ్యత కలెక్టరు, ఎస్పీల్లాంటి ఉన్నత స్థాయి అధికారులకు అప్పగించిన నేపథ్యంలో.. అవసరమైతే రాష్ట్రంలో దారులన్నీ మూసేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా.. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారందరినీ గుర్తించి.. తక్షణం వారిని క్వారంటైన్ చేయాలని ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది ప్రభుత్వం. కరోనా లక్షణాలు ఉన్న ఎవరైనా సరే.. ముందుకు రావాలని.. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తే.. తగిన వైద్య సదుపాయం కల్పిస్తామని కోరుతోంది.