ఏపీలో జీతాల కోత కాదు… రెండు విడతల్లో విడుదల..!

కరోనా వైరస్ ప్రభావం కారణంగా రాష్ట్ర ఖజానాలకు రాబడి తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల వేతనాలకు నిధులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల్లో భారీ కోత విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ఏపీ ప్రభుత్వం కూడా నడుస్తోంది.

ధనిక రాష్ట్రమైన తెలంగాణనే వేతనాల్లో కోత విధించడంతో ఏపీ ప్రభుత్వం ఆ బాట పట్టడం ఎవరినీ ఆశ్చర్యానికి గురి చేయలేదు. కాని వైఎస్ జగన్ తీసుకున్న ఆ నిర్ణయం మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

ఏపీ ప్రభుత్వం జీతాల్లో కోత విధించట్లేదని.. జీతాన్ని రెండు విడతల్లో విడుదల చేయాలని మాత్రమే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాకు తెలిపారు. సీఎం జగన్ ఉద్యోగ సంఘ నాయకులను పిలిచి పరిస్థితి వివరించారని… వచ్చే నెల జీతాన్ని రెండు విడతల్లో చెల్లిస్తామని చెప్పారని.. దీనికి మేం ఒప్పుకున్నామని ఆయన తెలిపారు. ఆర్థికంగా నిధులు సర్ధుబాటు కాగానే రెండో విడత వేతనాలు కూడా ఏప్రిల్‌లోనే జమ చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా, ప్రస్తుతానికైతే ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో మాత్రం ఇలా కోత విధిస్తారు.

  • సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు – 100 శాతం కోత
  • ఆలిండియా సర్వీస్ అధికారులు – 60 శాతం
  • ఇతర ఉద్యోగులు – 50 శాతం