సమోసాలు ఆర్డర్ చేశాడు…. మరుగుదొడ్లు కడిగించారు!

కరోనాతో అంతా భయపడుతుంటే.. కొందరు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ.. ప్రభుత్వ సేవలను దుర్వినియోగం చేస్తున్నారు. చేసేది తప్పని తెలిసి కూడా.. ఆకతాయి తనాన్ని ప్రదర్శిస్తున్నారు. చివరికి.. తగిన శిక్షనూ అనుభవిస్తున్నారు. ఇదంతా.. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కు చెందిన ఓ ఆకతాయి గురించి. ఇంతకీ.. అతనేం చేశాడు.. ఎలాంటి శిక్ష ఎదుర్కొన్నాడన్నది.. పైన హెడ్ లైన్ లో అర్థమైనా.. పూర్తి వివరాలు తెలుసుకోండి.

కరోనా ప్రభావం ఉత్తరప్రదేశ్ ను కూడా భయపెడుతోంది. ఇదేదీ పట్టని ఓ యువకుడు.. హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేశాడు. అధికారులు వెంటనే స్పందించారు. ఎవరికైనా అనారోగ్యమో అని ఆరా తీశారు. కానీ.. ఫోన్ చేసిన సదరు వ్యక్తి సమోసాలు ఆర్డర్ చేశాడు. వెంటనే తీసుకురావాలని కోరాడు. మొదట పోనీలే అని అధికారులు వదిలేశారు. అది అలుసుగా తీసుకున్న వ్యక్తి… పదే పదే అలాగే ఫోన్ చేసి విసిగించాడు.

చివరికి రంగంలోకి దిగిన అధికారులు.. ఆ వ్యక్తికి సమోసాలు ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన క్లిష్ట సమయంలో.. ఇలా చిల్లర వేశాలు వేసినందుకు.. సామాజిక శిక్ష విధించారు. మరుగుదొడ్లు కడిగించారు. ఇదేదో.. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్త కాదు. సాక్షాత్తూ రాంపూర్ జిల్లా మెజిస్ట్రేట్ ఆంజనేయకుమార్ సింగ్.. ట్వీట్ చేస్తే బయటికి వచ్చిన వార్త.

అందుకే.. ఆకతాయిలూ జాగ్రత్తగా ఉండండి. కరోనాతో ఆటలాడకండి. ఈ వైరస్ సోకితే ప్రాణం తీస్తుంది. వైరస్ నియంత్రణ కోసం పోరాడుతున్న వారితో చిల్లర వేశాలు వేస్తే… ఇలా పరువు పోతుంది.