ఇంటికే పెన్షన్లు… జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు

లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నా.. సంక్షేమాన్ని మాత్రం ఆపేందుకు సిద్ధంగా లేమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన చర్యలతో చాటి చెబుతోంది. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లతోనే కాలం వెళ్లదీసే వృద్ధులు, ఇతర వర్గాల వారికి.. ఇంటికే సొమ్మును పంపించేందుకు చర్యలు ప్రారంభించింది. 59 లక్షల మందికి అందుతున్న ఈ సహాయాన్ని.. ఇవాళ ఉదయం ప్రారంభించి.. 8.30 గంటల సమయానికే 53 శాతం పంపిణీ పూర్తి చేసినట్టు ప్రకటించింది.

ఈ సందర్భంగా… కరోనా విషయంలో అన్ని జాగ్రత్తలనూ తీసుకుంటూ పెన్షన్లు పంపిణీ చేసేలా సిబ్బంది.. ప్రభుత్వ మార్గదర్శకాలు అమలు చేశారు. మామూలుగా అయితే బయో మెట్రిక్ విధానంలో థంబ్ ఇంప్రెషన్ ద్వారా నమోదును ఖరారు చేసి.. పెన్షన్ జారీ చేసేవారు కానీ.. ఇప్పుడు హ్యూమన్ టచ్ ను సాధ్యమైనంత తక్కువ చేసేందుకు వినూత్న చర్యలు పాటిస్తున్నారు. వేలి ముద్రల బదులు ఫొటో గుర్తింపు కార్డులను ఆధారంగా చేసుకుని జారీని పూర్తి చేస్తున్నారు.

రేషన్ సరుకులను ఇంటికే పంపించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.. కొన్ని ప్రాంతాల్లో అమల్లోకి తెచ్చినా.. చాలా వరకు లబ్ధి దారుల సంఖ్య అధికంగా ఉన్న కారణంగా నియమిత వేళల్లో పంపిణీ చేస్తోంది. ఆ సమస్య పెన్షన్ల పంపిణీలో రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఇవాళ ఉదయం లోపే.. 53 శాతం పూర్తి చేసిన సిబ్బంది.. రేపటిలోగా దాదాపుగా అందరికీ పెన్షన్ డబ్బు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

సాధ్యమైనంత వరకూ.. మిగిలిన పథకాల విషయంలో కూడా.. వాలంటీర్ల సహాయంతో ఇంటింటికీ సేవలు అందించే దిశగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అందుకు అవసరమైన వనరులను సమకూర్చుకుంటోంది.