చరిత్రలో కలిసిపోయిన ‘ఆంధ్రాబ్యాంక్’

  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం
  • కనుమరుగైన తెలుగు బ్యాంకులు
  • రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్

మీరెప్పుడైన కోఠి వెళ్లారా… ఆ చౌరస్తాలో ఠీవిగా నిలబడి ఉండే ఆ బిల్డింగ్.. దానిపై ఆంధ్రాబ్యాంకు అనే అక్షరాలు.. చూస్తుంటేనే ఒక అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది. ఆ బిల్డింగ్ కట్టిన కొత్తలో కిలోమీటర్ దూరం నుంచి చూసినా ఆ బోర్డు కనపడేది.

కోఠిలోని ఆంధ్రాబ్యాంక్ బిల్డింగ్ అంటే ఒక భావోద్వేగంతో కూడిన జ్ఞాపకం. ఇప్పుడు ఆ బ్యాంకు కూడా ఒక జ్ఞాపకంగానే మిగిలిపోయింది. 97 ఏళ్ల చరిత్ర కలిగిన ‘ఆంధ్రాబ్యాంకు’ ఏప్రిల్ ఒకటిన కనమరుగైపోయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా… యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైపోయింది.

దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తర్వాత తెలుగువారి బ్యాంకుగా ఉన్న ఆంధ్రాబ్యాంకు కూడా తన పేరు, ఊరు మార్చేసుకొని వెళ్లిపోయింది. ఇప్పుడిక తెలుగువారి పేరుతో ఒక్క జాతీయ బ్యాంకు కూడా లేకపోవడం విచారించదగ్గ విషయమే.

1923 నవంబర్ 28న భోగరాజు పట్టాభి సీతారామయ్య ఈ ఆంధ్రాబ్యాంకును స్థాపించారు. రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ అందించిన నిధులతో…. 1 లక్ష రూపాయల పెయిడ్ అప్ క్యాపిటల్‌తో ఆయన మచిలీపట్నంలో ఈ బ్యాంకు స్థాపించారు. 1956లో భాషాప్రయోక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత బ్యాంకు రిజిస్టర్డ్ ఆఫీసు, ప్రధాన కార్యాలయాన్ని ప్రస్తుతం సుల్తాన్ బజార్‌లో ఉన్న బిల్డింగ్‌కు మార్చారు.

ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయీకరణ చేసే సమయంలో తొలి దశలో బ్యాంకు వదిలేసినా.. రెండో సారి 1980లో మాత్రం ఆంధ్రాబ్యాంకు తప్పించుకోలేక పోయింది. ఆ బ్యాంకును జాతీయీకరణ చేయడంతో అది ప్రభుత్వరంగంలోనికి వెళ్లిపోయింది. కాని బ్యాంకు సిబ్బంది కృషి, పట్టుదలతో లాభాల్లోకి దూసుకొని పోయింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్రాబ్యాంక్ కలిసి లీగల్ అండ్ జనరల్ అనే బ్రిటన్ ఫైనాల్సియల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీతో కలిసి ‘ఇండియా ఫస్ట్’ అనే లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీని స్థాపించాయి. ముంబై కేంద్రంగా ప్రారంభించిన ఈ కంపెనీ కేవలం నాలుగున్నర నెలల్లోనే 200 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించడం విశేషం. అంతే కాకుండా సంస్థ 7 నెలల్లోనే ఐఎస్ఓ సర్టిఫికేట్ సంపాదించి రికార్డు సృష్టించింది.

కాగా, దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య తగ్గించాలని.. దీనికి బ్యాంకుల విలీనమే సరైన నిర్ణయమని కేంద్ర ప్రభుత్వం భావించింది. దీనిలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సబ్సిడరీలుగా ఉన్న అన్ని బ్యాంకులను విలీనం చేశారు. అప్పుడే తెలుగువాళ్ల బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కనుమరుగైపోయింది. అంతే కాకుండా ఎస్బీఐ ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా నిలిచింది. ఇక రెండో దశలో పలు బ్యాంకుల విలీనం చేపట్టారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోనికి వచ్చింది.

  • ఒరియంట్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం అయ్యాయి. దీంతో పీఎన్‌బీ దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుగా అవతరించింది. తొలి స్థానంలో ఎస్బీఐ ఉంది.
  • సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకులో విలీనం చేయడంతో ఇది నాలుగో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా నిలిచింది.
  • ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకును విలీనం చేశారు.
  • ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు.
  • ఇప్పుడు ప్రభుత్వరంగంలో కేవలం 12 బ్యాంకులు మాత్రమే మిగిలాయి. 6 విలీన బ్యాంకులతో సహా మరో 6 స్వతంత్ర బ్యాంకులు ఉన్నాయి.
  • ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్‌లు విలీన బ్యాంకులు
  • ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు స్వతంత్ర బ్యాంకులు

ఈ రోజు నుంచి ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు, కస్టమర్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందుతారని కేంద్ర ఆర్థిక శాఖ తెలియజేసింది. బ్యాంకులు కూడా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశాయి. ఇక బ్యాంకింగ్ రంగంలో తెలుగు వారి ఊసే లేకుండా పోవడం కాస్త విచారించదగ్గ విషయం.