Telugu Global
NEWS

కరోనా దెబ్బతో బీసీసీఐకి భారీనష్టం

భారత, ఐపీఎల్ క్రికెటర్లకూ వేతనాల్లో కోత కరోనా వైరస్ కొట్టినదెబ్బతో ఓవైపు ప్రపంచమే విలవిలలాడిపోతుంటే…క్రీడల పేరుతో వేలకోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నక్రీడాసంఘాలు, క్రీడాకారులు ఆర్థికంగా భారీమొత్తంలో నష్టపోనున్నారు. ఇప్పటికే విఖ్యాత యూరోపియన్ ఫుట్ బాల్ క్లబ్ లు తమతమ కాంట్రాక్టు ఆటగాళ్ల వేతనాలలో భారీగా కోతను విధించినట్లు ప్రకటించాయి. అదేబాటలో.. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సైతం తమ జాతీయ, అంతర్జాతీయ క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టు వేతనాలలో కోత పెట్టినట్లు ప్రకటించాయి. అంతేకాదు…. ప్రపంచంలోనే అత్యంతభాగ్యవంతమైన భారత […]

కరోనా దెబ్బతో బీసీసీఐకి భారీనష్టం
X
  • భారత, ఐపీఎల్ క్రికెటర్లకూ వేతనాల్లో కోత

కరోనా వైరస్ కొట్టినదెబ్బతో ఓవైపు ప్రపంచమే విలవిలలాడిపోతుంటే…క్రీడల పేరుతో వేలకోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నక్రీడాసంఘాలు, క్రీడాకారులు ఆర్థికంగా భారీమొత్తంలో నష్టపోనున్నారు.

ఇప్పటికే విఖ్యాత యూరోపియన్ ఫుట్ బాల్ క్లబ్ లు తమతమ కాంట్రాక్టు ఆటగాళ్ల వేతనాలలో భారీగా కోతను విధించినట్లు ప్రకటించాయి. అదేబాటలో.. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సైతం తమ జాతీయ, అంతర్జాతీయ క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టు వేతనాలలో కోత పెట్టినట్లు ప్రకటించాయి. అంతేకాదు…. ప్రపంచంలోనే అత్యంతభాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు సైతం తన పరిథిలోని క్రికెటర్ల వేతనాలలో కోత పెట్టాలని భావిస్తోంది.

క్రికెట్ లేకుంటే ఆదాయం ఎలా?

భారత క్రికెట్ బోర్డుకు స్వదేశీ , విదేశీ సిరీస్ లు, ఐపీఎల్ లీగ్ లు జరిగితేనే ఆదాయం వస్తుందని, ఇప్పుడు…కరోనా వైరస్ దెబ్బతో క్రికెట్ కార్యకలాపాలు స్తంభించడంతో ఆదాయం కూడా లేకుండాపోయిందని, ఆదాయం లేనప్పుడు ఆటగాళ్లకు ఎక్కడ నుంచి తెచ్చి వేతనాలు చెల్లిస్తారని…భారత క్రికెటర్ల సంఘం అధ్యక్షుడు అశోక్ మల్హోత్రా ప్రశ్నిస్తున్నారు.

లాక్ డౌన్ తో పాటు ఐపీఎల్ వాయిదాతో భారత క్రికెట్ బోర్డు 3వేల కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోనుందని…అలాంటి పరిస్థితిలో కాంట్రాక్టు క్రికెటర్లకు, దేశవాళీ క్రికెటర్లకు…బీసీసీఐ వేతనాలు చెల్లించడం అసాధ్యమని, వేతనాలలో కోత అనివార్యమని, ఈ వాస్తవాన్ని క్రికెటర్లు దృష్టిలో ఉంచుకోవాలని అశోక్ మల్హోత్రా సూచించారు.

విరాట్, రోహిత్, బుమ్రాలకు భారీనష్టం…

వన్డే, టీ-20, టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న త్రీ-ఇన్-వన్ భారత క్రికెటర్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా …తలో 30కోట్ల రూపాయల చొప్పున ఆదాయం కోల్పోనున్నారు.

బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లో ఏ ప్లస్ గ్రేడ్ క్రికెటర్లుగా ఈ ముగ్గురూ 7 కోట్ల రూపాయల చొప్పున వేతనం పొందుతున్నారు. ఐపీఎల్ ద్వారా సైతం తలో 15 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇది కాక లోగో మనీ, స్పాన్సర్ షిప్ మనీ, ఎండార్స్ మెంట్లు, మ్యాచ్ ఫీజుల రూపంలో భారీగా ఆర్జిస్తున్నారు.

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ వివిధ రూపాలలో ఏడాదికి 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకూ సంపాదిస్తున్నాడు. అయితే…కరోనా వైరస్ తో క్రికెట్ సైతం లాక్ డౌన్ కావడంతో ఈ ముగ్గురూ భారీగా ఆదాయం కోల్పోనున్నారు.

అంతేకాదు…దేశవాళీ క్రికెటర్లకు మ్యాచ్ ఆడిన రోజున రోజుకు 50వేల రూపాయల చొప్పున బీసీసీఐ చెల్లిస్తోంది. దేశవాళీ మ్యాచ్ లు సైతం రద్దు కావడంతో.. అంతంత మాత్రం ఆదాయం ఉన్న దేశవాళీ క్రికెటర్లు సైతం ఆదాయం కోల్పోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

పాపం! ఐపీఎల్ క్రికెటర్లు….

ఏడువారాల ఐపీఎల్ లీగ్ ద్వారా కనీసం 20 లక్షల నుంచి 15 కోట్ల రూపాయల వరకూ స్వదేశీ, విదేశీ క్రికెటర్లు సంపాదిస్తున్నారు. విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, ధోనీ లాంటి ఐకాన్ క్రికెటర్లకు ఆయా ఫ్రాంచైజీ యాజమాన్యాలు రెండోకంటికి తెలియకుండా 15కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని వేతనంగా ఇస్తున్నాయి.

ఐపీఎల్ వేలం ద్వారా 50 లక్షల నుంచి 12 కోట్ల రూపాయల వరకూ అందుకొనే క్రికెటర్లు సైతం ఉన్నారు.

యశస్వి జైస్వాల్, రవి బిష్నోయ్ లాంటి నవతరం క్రికెటర్లు సైతం 2 నుంచి రెండున్నర కోట్ల రూపాయల మొత్తానికి కాంట్రాక్టులు సంపాదించారు.

ఐపీఎల్ నిబంధనల ప్రకారం…లీగ్ ప్రారంభానికి వారం రోజుల ముందు కాంట్రాక్టు మొత్తంలో 15 శాతం చెల్లిస్తారు. లీగ్ జరిగే సమయంలో 65 శాతం, లీగ్ ముగిసిన తర్వాత మిగిలిన 20 శాతం చెల్లించడం గత 12 సీజన్లుగా ఓ ఆనవాయితీగా వస్తోంది.

చెల్లించే ప్రసక్తేలేదంటున్న ఫ్రాంచైజీలు..

మార్చి 29న ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ నిరవధికంగా వాయిదా పడడంతో…ఫ్రాంచైజీలు గందరగోళంలో చిక్కుకొన్నాయి. కరోనా వైరస్ లాంటి మహమ్మారిలకు ఇన్సూరెన్స్ భద్రత లేదని…లీగ్ రద్దయితే తమకు పైసా ఆదాయం వచ్చే పరిస్థితి లేదని…లీగ్ జరగకుండా ఆటగాళ్లకు కాంట్రాక్టు మనీ ఎక్కడ నుంచి తెచ్చి చెల్లిస్తామని ఫ్రాంచైజీ యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి.

క్రికెట్ లేకపోతే ఆదాయం లేదని…ఆదాయం రాకుంటే క్రికెటర్లకు జీతాలూ లేవని చెప్పకనే చెబుతున్నారు. అయితే …తొలిసారిగా ఐపీఎల్ లీగ్ కాంట్రాక్టు సంపాదించిన యువక్రికెటర్లు అడ్వాన్సు తొలి విడత అందుకోకుండానే…తొలిమ్యాచ్ అడకుండానే లీగ్ రద్దుల పద్దులో చేరిపోతే తీవ్రనిరాశకు గురయ్యే ప్రమాదం లేకపోలేదని పలువురు మాజీ క్రికెటర్లు చెబుతున్నారు.

విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, ధోనీ లాంటి కడుపునిండిన క్రికెటర్లు 13వ సీజన్ రద్దయినా వచ్చిన నష్టం ఏమీలేదని…అదే అంతంత మాత్రం ఆర్థిక పరిస్థితి ఉన్న యశస్వి జైస్వాల్, రవి బిష్నోయ్ లాంటి క్రికెటర్లకు మాత్రం తీరని నష్టమేనని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

ఆదాయం సంగతి సరే…కరోనా వైరస్ బారిన పడకుండా ఉంటే చాలుననుకొనే రోజులు ఇవి. లాభనష్టాల గురించి ఆలోచించాల్సిన సమయంకానేకాదు. కరోనా మహమ్మారి ముప్పును తప్పించుకొంటే అదే పదేవేలు. అందులో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  1 April 2020 1:44 AM GMT
Next Story