నిరుపేదలకు… 1300 కోట్లు విడుదల చేసిన ఏపీ

కరోనా నియంత్రణ నిమిత్తం విధించిన ఆంక్షల కారణంగా.. ప్రజలెవరూ బయటికి వెళ్లడం లేదు. ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. అలాంటి వారిని ఆదుకునే నిమిత్తం.. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి రేషన్ సరుకులను ఉచితంగా అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఒక్కో కార్డుకు వెయ్యి రూపాయల సహాయాన్ని కూడా ఇప్పటికే ప్రకటించి ఉంది. ఆ మాటను నిలబెట్టుకుంటూ.. ఏకంగా 1300 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

ఈ నిధులను పంచాయతీ రాజ్ శాఖ ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పక్కదారి పట్టకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని.. డబ్బులు డిపాజిట్ చేయనుంది. సరుకుల పంపిణీలో పాటిస్తున్న జాగ్రత్తలనే ఈ చర్యలోనూ పాటించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అలాగే.. కరోనా ప్రభావాన్ని జీవ విచ్ఛిన్నకర ఉత్పాతంగా… బయోలాజికల్ డిజార్డర్ గా పేర్కొంటూ… మరో 120 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది.

ఈ 120 కోట్ల రూపాయల నిధులను.. రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగానికి కేటాయించింది. వ్యాధి తీవ్రత, నియంత్రణ, పర్యవేక్షణ కార్యక్రమాలను వీటిని వినియోగించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే భారీగా అందుతున్న విరాళాలను కూడా సద్వినియోగం చేసి.. ప్రతి పైసాను కరోనా నియంత్రణ దిశగా ఉపయోగించుకునేందుకు జగన్ ప్రభుత్వం ప్రణాళిక అమలు చేస్తోంది. అవసరాన్ని బట్టి నిధుల మొత్తాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తోంది.