పశ్చిమగోదావరిలో 14 పాజిటివ్‌ కేసులు – ఏపీలో హై అలర్ట్‌

ఏపీని కరోనా కమ్మేస్తోంది. ఒకటి రెండు జిల్లాలు మినహా అన్ని జిల్లాలనూ వణికిస్తోంది. నిన్నటి వరకు ప్రశాంతంగా… ఎంతో ధీమాగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఆ జిల్లాలో ఒకేసారి 14 పాజిటివ్‌ కేసులు బయటకొచ్చాయి.

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 58కి పెరిగింది. ఇవాళ ఈ సంఖ్య ఇంకా బాగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రకాశం, విశాఖ, గుంటూరు జిల్లాల్లో ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.

విజయవాడలోనూ దడ పుట్టిస్తోంది కరోనా. ఢిల్లీ – నిజాముద్దీన్‌ జమాత్‌ లింక్‌లతో పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. రెండు రోజుల నుంచి వీరందరినీ గుర్తించే పనిలో బిజీగా ఉన్నారు అధికారులు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారితో దగ్గరగా మెలిగిన వారిని గుర్తించడం సమస్యలను తెచ్చి పెడుతోంది. ఇంకా క్వారైంటన్‌కు తరలిస్తూనే ఉన్నారు. వీరిలో కొత్తగా ఇంకెంత మందికి పాజిటివ్‌ వస్తుందోనన్న టెన్షన్‌ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.

పశ్చిమగోదావరి జిల్లాలో బయటపడ్డ కేసులకు ఢిల్లీ లింక్‌ ఉంది. జిల్లా నుంచి 16 మంది ఢిల్లీ వెళ్లొచ్చారు. నిన్నటివరకూ జిల్లాలో ఒక్క కేసు బయటపడలేదు. ఒకేసారి 14 పాజిటివ్‌ కేసులు తేలాయి. అన్నీ ఢిల్లీ లింక్‌ కరోనా కేసులే. ఏలూరులో ఆరు, భీమవరంలో రెండు పాజిటివ్‌ కేసులు, పెనుగొండలో రెండు పాజిటివ్‌ కేసులు, ఉండి, ఆకివీడు, గుండుగొలను, నారాయణపురంలో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదు అయ్యాయి.

ఏపీలో మొత్తం 58 పాజిటివ్‌ కేసులు
పశ్చిమగోదావరి – 14
ప్రకాశం – 11
విశాఖ – 10
గుంటూరు – 09
కృష్ణా – 05
తూర్పుగోదావరి – 04
అనంతపురం – 02
చిత్తూరు – 01
కర్నూలు – 01
నెల్లూరు – 01