రిలీజ్ కు ముందే అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది

కరోనా ఎఫెక్ట్ చిన్న సినిమాలపై గట్టిగా పడింది. మరో నెల రోజుల పాటు విడుదల వాయిదా వేయలేక, వడ్డీలు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే డిజిటల్ స్ట్రీమింగ్ కు ఇచ్చేస్తున్నారు. ఈ వరసలో ముందుగా చేరిన సినిమా ‘శక్తి’.

తమిళ్ లో శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమాను తెలుగులో శక్తి పేరిట డబ్ చేశాడు రాజేష్ అనే చిన్న నిర్మాత. మార్చి 20న ఆ సినిమాను రిలీజ్ చేద్దామనుకున్నాడు. కానీ కుదర్లేదు. ఆ తర్వాత వారం అనుకున్నాడు. కానీ అప్పటికే లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది.

ఏప్రిల్ లో కూడా థియేటర్లు తెరుచుకుంటాయనే నమ్మకం లేదు. మే నెల వరకు వెయిట్ చేద్దామంటే అప్పటికి పెద్ద సినిమాలు క్యూ కడుతున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో శక్తి సినిమాను థియేటర్లలో కంటే ముందే స్ట్రీమింగ్ కు ఇచ్చేశాడు సదరు నిర్మాత. నిన్నట్నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.