రెండు రోజుల్లో విమానాలు నడుపుతామంటున్న ఎయిర్ ఇండియా…

కరోనా కట్టడిలో భాగంగా మార్చి 22 నుంచి దేశంలో అన్ని విమానాశ్రయాలు మూతపడ్డాయి. ఒక్కటంటే ఒక్క విమానం కూడా గాల్లో ఎగరకుండా హ్యాంగర్లకు పరిమితమయ్యాయి. కొన్ని ఎయిర్ పోర్టుల్లో హ్యంగర్లు కూడా చాలకపోవడంతో రన్‌వేల పైనే విమానలను పార్క్ చేశారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ముగిసినా… ముగియక పోయినా… ఈ నెల 4, 5 తేదీల్లో విమానాలను నడపాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది.

కాగా, ఇవి ప్యాసింజర్ విమానాలు కావని కార్గో విమానాలని ఎయిరిండియా సీఎండీ రాజీవ్ బన్సల్ స్పష్టం చేశారు. హాంకాంగ్ నుంచి వైద్య పరికరాలను తీసుకొచ్చేందుకు అవసరమైన అనుమతులు లభించాయని.. మరోవైపు షాంఘై నుంచి ఈ నెల 6న మెడిసిన్స్ తీసుకొని రావల్సిన విమానానికి మాత్రం ఇంకా అనుమతి రాలేదని ఆయన చెప్పారు.

ఈ విమానాల ప్రయాణానికి పని చేసే క్యాబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్‌కు అన్ని రకాల రక్షణ పరికరాలు అందిస్తామని చెప్పారు. శానిటైజర్లు, గ్లౌవ్స్, మాస్కులతో పాటు గౌన్లు కూడా అందిస్తామన్నారు.

మరోవైపు మన దేశంలో లాక్‌డౌన్ కారణంగా చిక్కుకొని పోయిన జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, ఐర్లాండ్ పౌరులను తరలించేందుకు 18 చార్టెడ్ విమానాలు నడపనున్నట్లు రాజీవ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ దేశాలన్నింటితో వాణిజ్య ఒప్పందాలు కుదిరాయని… ప్రయాణికులను అక్కడ దింపిన తర్వాత విమానాలు ఖాళీగానే తిరిగి ఇండియాకు చేరుకుంటాయని చెప్పారు.

కాగా, ఈ విమానాల ప్రయాణాల కోసం పని చేసే సిబ్బంది ఇండియాకు చేరుకోగానే 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధన విధించినట్లు రాజీవ్ పేర్కొన్నారు.