ఉద్యోగులూ… ఆందోళన వద్దు… రేపే వేతనాలు

కరోనా నేపథ్యంలో.. ప్రభుత్వ సిబ్బందికి వేతనాల కోతపై.. ఇప్పటికే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసేసుకున్నాయి. ఏప్రిల్ 1 దాటినా చాలా మందికి వేతనాలు పడలేదు. అందుకు కారణం.. బ్యాంకుకు సెలవు రోజు కావడం ఒకటైతే.. ప్రభుత్వాలు కోతలకు అనుగుణంగా ఇవ్వాల్సిన వేతనాలు ఖరారు చేయకపోవడం మరోటి. కరోనా ప్రభావంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అధికారులకు కాస్త సమయం పట్టిందన్నది కాదనలేని వాస్తవమే.

ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సిబ్బంది ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నాయి. మూడో తేదీ నాడు.. అంటే శుక్రవారం నాడు సాధ్యమైనంతవరకూ అందరికీ జీతాల చెల్లింపు పూర్తవుతుందని ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ మాజీ ఉద్యోగుల పెన్షన్ల చెల్లింపులనూ ఇదే రీతిన పూర్తి చేయబోతున్నట్టు భరోసా ఇచ్చాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పాయి.

ఇక.. కోతల అనంతరం వేతనాలు, పెన్షన్ల చెల్లింపునకు అవసరమైన మొత్తాన్ని అధికారులు 3 వేల కోట్ల రూపాయలుగా లెక్కించారు. అలాగే.. రేషన్ కార్డు ఉన్న వారికి ప్రతి కార్డుకూ వెయ్యి రూపాయల సహాయం నిమిత్తం అందించేందుకు మరో 1300 కోట్లు అవసరం అవుతాయని తేల్చారు. వీటి చెల్లింపుల నిమిత్తం ఇప్పటికే 1400 కోట్ల రూపాయల మొత్తాన్ని ఓ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మిగతా రుణాన్నీ తీసుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

కరోనా సృష్టిస్తున్న ఇంతటి విలయతాండవంలోనూ.. జగన్ ప్రభుత్వం అందరినీ సమన్వయం చేస్తూ పరిపాలన కొనసాగించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఆర్థికంగా సమస్యలున్నా.. అన్ని వర్గాలకూ న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. కేంద్ర సహాయానికి కూడా ప్రయత్నాలు చేస్తోంది.