మళ్లీ దర్శకుడిగా మారతాడట

దర్శకత్వం అనేది ఒక వ్యసనం. ఒక్కసారి అలవాటైందంటే ఇక ఆ రంగం నుంచి తప్పుకోవడం చాలా కష్టం. ఇండస్ట్రీలో ఏ క్రాఫ్ట్ లో ఉన్న వ్యక్తి అయినా కెరీర్ లో ఒక్కసారైనా మెగాఫోన్ పట్టుకోవాలని కలలుకంటాడు. ఆ ప్రొఫెషన్ అలాంటిది. కోన వెంకట్ కు కూడా అలాంటి డ్రీమ్ ఉంది. దానికోసం అతడు ప్రయత్నించాడు కూడా. కానీ ఫెయిల్ అయ్యాడు.

చాలా ఏళ్ల కిందటే మెగాఫోన్ పట్టాడు కోన వెంకట్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీకొచ్చిన ఈ సకల కళావల్లభుడు.. కెరీర్ స్టార్ట్ చేసిన కొన్నాళ్లకే దర్శకుడయ్యాడు. మాధవన్ ను హీరోగా పెట్టి ఓ సినిమా తీశాడు. షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ ఆర్థిక కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు దర్శకత్వంపై మరోసారి మనసుపడ్డాడు కోన.

ఈసారి ఎలాగైనా దర్శకత్వం వహిస్తానంటున్నాడు ఈ రచయిత కమ్ నిర్మాత. ప్రస్తుతం నిశ్శబ్దం అనే సినిమాకు కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న త్వరలోనే దర్శకుడిగా మారతానంటున్నాడు. ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తనే నిర్మాతగా ఉంటూ దర్శకత్వ బాధ్యతలు స్వీకరిస్తానంటున్నాడు. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంతకుమించి డీటెయిల్స్ బయటపెట్టలేదు కోన. కథ మాత్రం రెడీగా ఉందని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని అంటున్నాడు.