సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ…. 5 విషయాలపై సూచనలు.. కానీ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు లేఖ రాశారు. కరోనా నియంత్రణ చర్యల నేపథ్యంలో ప్రభుత్వ తీరును తప్పుబడుతూ.. పలు సూచనలు చేశారు. తన ప్రభుత్వంలో అమలు చేసిన పలు విషయాలు ప్రస్తావించారు. అన్నాక్యాంటీన్లు, రియల్ టైమ్ గవర్నెన్స్, విశాఖ మెడ్ టెక్ జోన్, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, పంట ఉత్పత్తుల కొనుగోలు విషయాలు ప్రస్తావించారు.

అన్నాక్యాంటీన్ లు తెరిచి.. పేదలకు వసతి సౌకర్యాలు కల్పించాలని కోరారు. విశాఖ మెడ్ టెక్ జోన్ ద్వారా.. వెంటిలేటర్లు, వైద్యుల ఉపకరణాలు ఉత్పత్తి చేయాలన్నారు. ఆర్టీజీఎస్ నిర్వీర్యం అయ్యిందని ఆవేదన కూడా చెందారు. పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. బ్లాక్ మార్కెట్ విక్రయాలకు అడ్డుకట్ట వేయలని సూచించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అవసరమని చెప్పారు. ఇలా.. మరిన్ని విషయాలు ప్రస్తావిస్తూ సుదీర్ఘమైన లేఖను సీఎంకు పంపించారు.

అయితే చంద్రబాబు ప్రస్తావించిన విషయాల్లో.. ఇప్పటికే ప్రభుత్వం పలు చర్యలు అమలు చేస్తున్న విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. వలస కార్మికులు, నిరు పేదలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి.. ఎక్కడికక్కడ శిబిరాలు ఏర్పాటు చేసి తగిన వసతి కల్పిస్తున్నారు. కాలి నడకన పయనిస్తున్న వారిని గుర్తించి సౌకర్యాలు అందజేస్తున్నారు. వైద్య సిబ్బంది సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటికే.. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ కిట్లు తెప్పించేందుకు చర్యలు తీసుకుంటోంది.

పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక అధికారుల సమన్వయంతో లాక్ డౌన్ అమలును పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు అన్ని ప్రాంతాల్లో నిత్యావసరాలు అందజేసేందుకు అనువుగా చర్యలు తీసుకుంటున్నారు. రద్దీ ఎక్కువగా ఉంటున్న చోట రైతు బజార్లను మైదానాల్లోకి తరలించి.. ప్రజలు సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకునేలా అమ్మకాలు, కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారు. పేదలకు ఉచితంగా సరుకులు అందజేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

ఇన్ని చర్యల అమలులో భాగంగా కొన్ని సమస్యలు ఎదురవుతున్నా.. వాటిని పరిష్కరిస్తూ ప్రభుత్వం ముందుకు పోతోందని వైసీపీ నాయకులతో పాటు.. సామాన్య ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. కరోనా లాక్ డౌన్ అమలు తర్వాత.. జనం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి విమర్శలు రాలేదని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన సూచనలు మాత్రమే కాదు… ప్రజా సంక్షేమం దిశగా ఎవరు మంచి సలహాలు ఇచ్చినా… ప్రభుత్వం పరిశీలించి తప్పక పాటిస్తుందని చెబుతున్నారు వైసీపీ నాయకులు.