నిఖిల్ పెళ్లి కూడా వాయిదా

అందరూ ఊహించినట్టే హీరో నిఖిల్ కూడా తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు. లెక్కప్రకారం ఈ నెలలోనే నిఖిల్ పెళ్లి జరగాలి. హైదరాబాద్ లో రిసార్ట్ కూడా బుక్ చేశారు. కానీ కరోనా కారణంగా తన వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నట్టు నిఖిల్ ప్రకటించాడు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత మరో మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసుకుంటాననని తెలిపాడు.

కొన్నేళ్లుగా డాక్టర్ పల్లవిని ప్రేమిస్తున్నాడు నిఖిల్. ఈమధ్యే ఆ విషయాన్ని బయటపెట్టాడు. మేటర్ బయటకొచ్చిన వెంటనే, గత ఫిబ్రవరిలో ఆమెతో నిశ్చితార్థం కూడా కానిచ్చేశాడు. గోవాలో వీళ్ల ఎంగేజ్ మెంట్ స్టయిల్ గా జరిగింది. అదే ఊపులో హైదరాబాద్ లో పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడు కానీ కరోనా కారణంగా అది వాయిదాపడింది.

ప్రస్తుతం ఈ హీరో సామాజిక సేవలో బిజీగా ఉన్నాడు. వైద్యులు, పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు అందిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేదలకు భోజనం పెడుతున్నాడు. ఇలా ఒక రోజుతో ఈ పని ఆపేయలేదు నిఖిల్. ప్రతి రోజూ తనకు తోచినంత ఇలా సహాయం చేస్తూనే ఉన్నాడు.