రోజూ గుడ్లు లాగించేస్తున్న రానా

లాక్ డౌన్ టైమ్ లో హీరోలంతా ఒక్కొక్కరు ఒక్కో పని పెట్టుకున్నారు. చిరంజీవి మొత్తంగా సీసీసీ వ్యవహారాన్ని భుజానికెత్తుకున్నారు. బన్నీ అయితే పూర్తిగా ఫ్యామిలీకి అంకితమైపోయాడు. ఈరోజు కొడుకు పుట్టినరోజును కూడా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలంతా ఇంట్లోనే జిమ్ చేస్తూ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. వీళ్లందరికీ భిన్నంగా నడుచుకుంటున్నాడు హీరో రానా.

అవును.. ఈ ఆరడుగుల ఆజానుబాహుడు ఈ క్వారంటైన్ టైమ్ లో కేవలం తినడమే పనిగా పెట్టుకున్నాడు. మరీ ముఖ్యంగా రోజూ విపరీతంగా గుడ్లు తింటున్నాడు. దీనికి ఓ కారణం కూడా ఉంది. ఆమధ్య రానా ఆరోగ్యం బాగా క్షీణించింది. అమెరికా వెళ్లి ట్రీట్ మెంట్ కూడా తీసుకున్నాడు. ఆ టైమ్ లో బక్కపల్చగా తయారయ్యాడు. పైగా అదే టైమ్ లో చేసిన అరణ్య అనే మూవీ కోసం బాగా తగ్గాల్సి వచ్చింది. ఓవైపు అనారోగ్యం, మరోవైపు అరణ్య మూవీ కారణంగా రానా మొత్తం తగ్గిపోయాడు.

అంత హైట్ ఉన్న రానాను అంత బక్కపల్చని శరీరంలో చూడలేకపోయారు జనం. అటు రానా కూడా కాస్త బరువు పెరగడానికే రెడీ అయ్యాడు. సరిగ్గా లాక్ డౌన్ వచ్చి పడింది. ఇంకేముంది.. కాస్త కండపట్టడం కోసం ఇలా గుడ్లు తినడం స్టార్ట్ చేశాడు ఈ హీరో. త్వరలోనే సరికొత్త భళ్లాలదేవుడ్ని చూడబోతున్నారు జనం.