కరోనా చికిత్సకు మలేరియా డ్రగ్… బాగా పని చేస్తోందంటున్న ట్రంప్..!

కరోనా వైరస్ వలన కలిగే కోవిడ్-19 వ్యాధికి ఇంత వరకు మందు లేదు. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి బారిన పడి అక్కడ చాలా మంది కోలుకున్నారు. కాని వారికి ఏ విధమైన చికిత్స అందించారో చైనా కూడా ఇంత వరకు బయట ప్రపంచానికి చెప్పలేదు. కాగా, కాస్త ఆలస్యంగానైన మేలుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కరోనా వైరస్ చికిత్సకు మలేరియా డ్రగ్ పని చేస్తోందని చెబుతున్నారు.

శుక్రవారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ మలేరియా డ్రగ్ అయిన హైడ్రాక్సీక్లోరోక్విన్‌కు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. కరోనా వైరస్ నియంత్రణ, చికిత్సలో భాగంగా ఈ డ్రగ్‌ను కూడా వాడుతున్నామని.. దానిపై పరిశోధనలు కూడా జరుపుతున్నామని ఆయన చెప్పారు. వీటి ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటికే కరోనా బారిన పడిన రోగులలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని… ఇదొక మంచి పరిణామమని ఆయన అన్నారు.

ఇప్పటికే అమెరికా ఫెడరల్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఈ మందు వాడకానికి అనుమతి ఇచ్చిందన్నారు. అమెరికాలో హైడ్రాక్సీక్లోరోక్విన్ నిల్వలు భారీగా ఉన్నాయని.. సప్లై కూడా అధికంగా ఉందని.. ఒక వేళ ఈ డ్రగ్ సమర్థవంతంగా పని చేస్తోందని తేలితే.. కరోనా చికిత్సలో మరో ముందడుగు పడినట్లేనని ట్రంప్ చెప్పారు.

కాగా, కరోనా నుంచి కోలుకున్న ఒక మహిళ మీడియాతో మాట్లాడుతూ.. తనకు అందించిన చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడినట్లు నాకు తెలుసు. అయితే ఎంత మొత్తంలో వాడారో తెలియదు కాని ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నానని చెప్పారు. దీంతో మలేరియా డ్రగ్ పై మరిన్ని పరిశోధనలు ప్రారంభమయ్యాయి.