వాళ్లు ఇబ్బంది పడొద్దు… జాగ్రత్తగా ఉండండి!

ఆంధ్రప్రదేశ్ ప్రథమ పౌరుడు.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. కరోనా నియంత్రణ చర్యల్లో భాగం పంచుకున్నారు. మార్కెటింగ్, పౌర సరఫరాల ఉన్నతాధికారులతో సమీక్షించారు.

ధాన్యం క్రయవిక్రయాలపై కరోనా ప్రభావం పడకుండా చూడాలని.. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడాలని ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు లాక్ డౌన్ ఆంక్షల కారణంగా అంతరాయం కలగకుండా చూడాల్సింది అధికారులే అని స్పష్టం చేశారు.

ఇప్పటికే అమలు చేస్తున్న చర్యలను అధికారులు గవర్నర్ కు వివరించగా…. ఆయన సంతృప్తి చెందినట్టు తెలిసింది. అలాగే.. ఢిల్లీకి వెళ్లి మతపరమైన కార్యక్రమాల్లో కొందరు పాల్గొన్నారన్న విషయం బయటపడిన తర్వాత.. కరోనా కేసులు పెరగడంపైనా గవర్నర్ దృష్టి పెట్టారు. మత గురువులతో మాట్లాడారు. కొన్ని ప్రాంతాల్లో… పరీక్షలు చేయడానికి వెళ్తున్న ప్రభుత్వ సిబ్బందిపై జరుగుతున్న దాడులను మత గురువులకు వివరించారు.

ఇలాంటి చర్యలు జరగకుండా చూసుకోవాలని కాస్త గట్టిగానే విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. మత పరమైన కార్యక్రమాలు కూడా ఇప్పటి పరిస్థితుల్లో వద్దని కోరారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాతే పెట్టుకోవాలని సూచించారు.

ఇలా… ప్రభుత్వ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ… కరోనా నియంత్రణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

కేంద్రానికి ఎప్పటికప్పుడు రాష్ట్ర పరిస్థితిని తెలియజేసే గవర్నర్… ఇంత యాక్టివ్ గా ఉండడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి మరింత సహకరించాలని కోరుతున్నారు. సమస్య పరిష్కారానికి అవసరమైన నిధులు కేంద్రం నుంచి వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.