రైల్వే శాఖ లెక్క…. ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాలకు 2.20 లక్షల మంది వచ్చారట…?

కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న తీరుకు ప్రజల్లోనే కాదు.. పాలకుల్లోనూ ఆందోళన పెరుగుతోంది. ఇలాంటి ముప్పును మరింత పెరిగేలా చేసిన నిజాముద్దీన్ యాత్రికులు… తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నారు. ఏప్రిల్ 7 లోగా అంతా సర్దుకుంటుందని భావించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు.. తమ రాష్ట్రంలో పరిస్థితి సానుకూలంగానే ఉందని నాలుగైదు రోజుల క్రితం వరకూ భావించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లారు.

రైల్వే శాఖ అందించిన తాజా వివరాల ప్రకారం.. ఈ లెక్కలు చూస్తుంటే.. గుండెలు గుభేల్ అంటున్నాయి. మార్చి 11 నుంచి 23 మధ్య… ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు.. ఏకంగా 2 లక్షల 20 వేల మంది ప్రయాణికులు వచ్చారని చెబుతున్న అధికారిక లెక్కలు చూసి.. మరో కొత్తరకం ఆందోళన మొదలైంది. వీరి పేర్లు, మొబైల్ నంబర్ల ఆధారంగా.. రైల్వే అధికారులు ఇచ్చిన వివరాలను.. శోధించే పనిలో పడ్డారు ఇరు రాష్ట్రాల అధికారులు.

ఇప్పటికే చాలా మందిని గుర్తించి క్వారంటైన్ చేశామని ఇరు రాష్ట్రాల అధికారులు ప్రకటించారు. కానీ.. వారు చెప్పిన లెక్కలకు.. 2 లక్షల 20 వేల మంది లెక్కలకు ఏ మాత్రం పొంతన లేకుండా కనిపిస్తోంది. కనీసం.. 10 శాతం ప్రయాణికులనైనా పాలకులు, అధికారులు గుర్తించారా అన్నది ఇప్పుడు లక్ష మిలియన్ డాలర్ల ప్రశ్నగా నిలుస్తోంది. ఈ 2 లక్షల 20 వేల మందిలో… ఎందరు మర్కజ్ సదస్సులకు హాజరయ్యారు… వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి… అసలు వాళ్లంతా ఎక్కడున్నారు.. కరోనా సోకిన వాళ్లు ఎవరెవరికి అంటిస్తున్నారో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

అందుకే.. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారంతా స్వచ్ఛందంగా పరీక్షలకు ముందుకు వస్తే.. ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఎవరికి వారు తమ సమాచారాన్ని అధికారులకు అందిస్తే.. ఈ సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్లవుతారు.