కరోనాతో కూడా రాజకీయం చేస్తున్న తెలుగుదేశం పార్టీ..!

పుట్టుకైనా… చావైనా… మంచైనా… చెడైనా… శుభమైనా… అశుభమైనా.. అసలు సందర్భం ఏదైనా దాన్ని రాజకీయంగా వాడుకోవడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. ప్రతిపక్ష పార్టీగా ఈ సంక్షోభ సమయంలో అధికార పార్టీకి సహాయ సహకారలు అందించాల్సింది పోయి.. చిన్న విషయానికి కూడా రాజకీయం చేస్తున్నారు. ఆవు చేలో మేస్తుంటే దూట గట్టున మేస్తుందా అన్న చందంగా.. ఏకంగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడే వైరస్ రాజకీయాలు చేస్తుంటే… ఇక ఆ పార్టీ నాయకులు మాత్రం ఎందుకు ఊరుకుంటారు.

కరోనా వైరస్ ప్రభావంతో లాక్‌డౌన్ విధించడంతో ఏపీ ప్రభుత్వ ఖజానాకు రావల్సిన పన్నులు, ఇతర నిధులకు భారీ గండి పడింది. దీనికి తోడు తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా నిత్యావసరాల పంపిణీ, పేదలకు 1000 రూపాయల నగదు పంపిణీ భారం పడింది. ఇదంతా బడ్జెటేతర ఖర్చులే.

దీంతో తప్పని సరై ఉద్యోగుల జీతాలను రెండు విడతల్లో చెల్లిస్తామని చెప్పింది. కానీ చంద్రబాబు నాయుడు దీన్ని కూడా రాజకీయం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు కోత పెట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని ఆరోపించారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించడంలో చంద్రబాబుకు మించిన వాళ్లే లేరు. ఇప్పుడు అదే విధంగా.. పేదలకు ఉచిత రేషన్, నగదు పంపిణీతో ఎక్కడ ప్రభుత్వానికి ఇమేజ్ పెరుగుతుందో అని ఏకంగా ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

ఇక ఆ పార్టీలో ముఖ్య నేతలు కూడా చంద్రబాబు బాటే పట్టారు. నిజానిజాలు తెలుసుకోకుండా బురదజల్లి పోతున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఈ మధ్య కాలంలో ఎక్కడా కనిపించడం లేదు. ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియదు కాని.. సడెన్‌గా ఆయనకు ఏపీ ప్రజల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. దీంతో ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.

పేదలకు కేంద్రం ఇస్తున్న బియ్యం, పప్పు, గ్యాస్ సిలిండర్ అందడం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. మరి ప్రధాన పత్రికల్లో పేదలు రేషన్ తీసుకుంటున్నట్లు, నగదు అందుకుంటున్నట్లు వచ్చిన ఫొటోలు ఎక్కడి నుంచి వచ్చాయో కళానే చెప్పాలని పలువురు ప్రశ్నిస్తున్నారు.

కళా వెంకట్రావు అసలు రేషనే అందట్లేదని లేఖలు రాస్తుంటే.. వాళ్ల పార్టీ నాయకులే.. రేషన్‌లో కోత పెడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటనలన్నీ చూసి అసలు టీడీపీ నాయకులకు ఏమైందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

వీళ్లందరిదీ ఒక దారి అయితే యనమల రామకృష్ణుడిది మరో దారి. ఒకప్పుడు ఆర్థిక మంత్రిగా చేసిన ఆయనకు బడ్జెట్ అంచనాలకు, ఖజానా నిల్వలకు తేడా తెలుసా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఎందుకంటే.. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది 2.28 లక్షల కోట్ల బడ్జెట్‌లో ఎంత ఖర్చు పెట్టారు..? ఆరు నెలల్లో 35 శాతం కూడా ఖర్చు పెట్టలేదు. మిగిలిన 65 శాతం డబ్బు ప్రభుత్వం దగ్గరే ఉంది కదా.. అయినా జీతాల్లో కోతెందుకు పెట్టారని ప్రశ్నించారు.

ఈ మాటలు విన్న పలువురు ముక్కుమీద వేలేసుకున్నారు. బడ్జెట్ లెక్కల్లో అంచనాలు ఉంటాయి కానీ.. ఆ డబ్బంతా ఖజానాలో ఉంటుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు దిగిపోయే నాటికి ఏపీ ఖజానాలో ఉంది 100 కోట్ల రూపాయలు. బడ్జెట్‌లో 2.28 లక్షల కోట్లు ప్రవేశ పెట్టినంత మాత్రాన అంత డబ్బు ప్రభుత్వం దగ్గర ఉన్నట్లా మాజీ ఆర్థిక మంత్రి అని ఎద్దేవా చేస్తున్నారు. దీనికి తోడు కరోనా ఏపీలో ఇంతగా ప్రబలడానికి వైఎస్ జగన్ అలసత్వమే అంటు మరో నిరాధార ఆరోపణ చేశారు.

కరోనా వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం ఎంతో కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంది. దేశంలో లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సమన్వయం చేయడానికి వాటన్నింటినీ ఒకే శాఖ కిందకు తీసుకొచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వమే.

అంతే కాదు.. నెల్లూరులో తొలి కేసు నమోదైన నాటి నుంచి ఎక్కడికక్కడ క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయడమే కాకుండా.. గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లతో రాష్ట్రమంతా సర్వే చేయించింది ఒక్క ఏపీ మాత్రమే. ఇంటింటి సర్వే కేరళ తర్వాత ఏపీనే చేసింది. ముందుగానే రేషన్ ఇవ్వడం, నగదు సహాయం చేయడం అనేది మాటలకే పరిమితం కాకుండా చేసి చూపించింది సీఎం జగన్ ప్రభుత్వమే. మర్కజ్ యాత్రీకులందరినీ గుర్తించి వాళ్లందరినీ ఐసోలేషన్, క్వారంటైన్ సెంటర్లకు పంపిన మొదటి రాష్ట్రం ఏపీనే. ఇవన్నీ మరచి ప్రతిపక్షం కేవలం రాజకీయ కక్షతో అభాండాలు వేస్తోంది.

ప్రతిపక్ష టీడీపీ కరోనా విషయంలో ప్రభుత్వానికి సహాయం చేయకపోయినా పర్వాలేదు. కానీ.. ఇలా అయిన దానికీ కాని దానికి అడ్డుతగిలి సమస్యలు సృష్టించవద్దని పలువురు కోరుతున్నారు.