ఇలా చేయకండి… కరోనా వ్యాప్తికి కారణం కాకండి

గుట్కా, తంబాకు, ఖైనీ, పాన్ మసాలా అలవాటు ఉన్నవాళ్లు మన దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి వాళ్లలో 99 శాతం చేసే పని.. నమలడం ఎక్కడపడితే అక్కడ ఊయడం. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ.. ఎవరూ ఇందుకు అతీతులు కారు. తాజా పరిణామాల నేపథ్యంలో.. కరోనా కాటు బలంగా ఉంటున్న నేపథ్యంలో.. ఈ అలవాటు మంచిది కాదంటున్నారు నిపుణులు.

ఉమ్మివేసే సమయంలో నోటి నుంచి వెలువడే లక్షలాది తుంపర్ల కారణంగా కరోనా సులువుగా ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మామూలుగా ఒక సారి దగ్గినా.. తుమ్మినా.. కనీసం 3 వేల తుంపర్ల వరకూ నోటి నుంచి బయటికి వస్తుంటాయని.. అలాంటిది ఇలా పాన్లు, గుట్కాలు, ఖైనీలు తిని ఉమ్మేస్తే ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

ఇలా నోటి నుంచి బయటికి వచ్చిన రేణువులు.. కనీసం 3 గంటల పాటు ఆ ప్రాంత పరిసరాల్లో సజీవంగానే ఉంటాయట. పొరపాటున ఇవి ఎవరికైనా అంటితే.. వారి నుంచి మరొకరికి అంటుకునే ప్రమాదాన్ని ఎవరూ తప్పించలేరు. అందుకే.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్తే.. మనుషులనే కాదు.. ప్రాంతాలనూ తాకకుండా ఉండాలి. అంతా పరిశుభ్రంగా ఉందని నిర్థారించుకున్నాకే.. కూర్చోవడం, తాకడం చేయాలని.. లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని అప్రమత్తం చేస్తున్నారు.

ఇలాంటి సమస్య నుంచి తప్పించుకోవాలంటే.. ఒకటి పాన్, గుట్కా, ఖైనీ, తంబాకు లాంటి అలవాటు ఉన్న వాళ్లు సామాజిక బాధ్యతను గుర్తెరిగి.. తమ అలవాట్లను తగ్గించుకోవాలి. కనీసం.. బహిరంగంగా ఎక్కడపడితే అక్కడ ఉమ్మడం ఆపాలి. రెండోది.. ప్రజలు తమంతట తాము ఇలాంటి వ్యక్తులున్న చోట.. మరింత సామాజిక దూరం పాటించాలి. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. లేదంటే.. ముప్పు తప్పదన్న వాస్తవాన్ని గ్రహించాలి.