చిరు చూపు ఇప్పుడు పవన్ పై పడిందా?

చిరంజీవి, పవన్ కల్యాణ్ కలిసి నటిస్తే చూడాలనేది కేవలం మెగా అభిమానుల కోరిక మాత్రమే కాదు.. సగటు తెలుగు సినీప్రేక్షకుడి కోరిక కూడా. దశాబ్దాలుగా అభిమానుల మనసుల్లో ఉన్న ఈ కోరిక నెరవేరడం దాదాపు అసాధ్యం అని అంతా ఫిక్స్ అయిపోయారు కూడా. అయితే ఈ కాంబినేషన్ పై ఇప్పుడిప్పుడే ఆశలు చిగురిస్తున్నాయి. అవకాశాలు మిణుకుమిణుకుమంటూ కనిపిస్తున్నాయి. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే చిరంజీవి సినిమాలో పవన్ కల్యాణ్ ఓ ప్రత్యేక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు చిరంజీవి. ఇందులో 30 నిమిషాల ఓ ప్రత్యేక పాత్ర ఉంది. దీన్ని రామ్ చరణ్ తో చేయించాలనేది ప్లాన్. కానీ కరోనా రాకతో ఆర్ఆర్ఆర్ షెడ్యూల్స్ అన్నీ అస్తవ్యస్థం అయ్యాయి. తిరిగి మళ్లీ ఎప్పుడు షూట్ స్టార్ట్ అవుతుందో తెలీదు. ఇలాంటి టైమ్ లో ఆచార్య కోసం రామ్ చరణ్ ను రాజమౌళి వదిలేస్తాడా అనేది డౌట్. అలా చేస్తే ఆర్ఆర్ఆర్ మరింత ఆలస్యం అవుతుంది. చెప్పిన తేదీకి వచ్చేది అనుమానమే.

సరిగ్గా ఇక్కడే పవన్ కల్యాణ్ పేరు తెరపైకొచ్చింది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టులో చరణ్ నటించడం కుదరకపోతే అప్పుడు పవన్ ను రంగంలోకి దించాలని చూస్తున్నారట చిరంజీవి. కరోనా తగ్గిన తర్వాత దీనిపై క్లారిటీ రాబోతోంది.

నిజానికి ఈ ప్రత్యేక పాత్ర కోసం మహేష్ బాబును సంప్రదించారు. మహేష్ కూడా ఓకే చెప్పాడు. కానీ ఆఖరి నిమిషంలో చరణ్ వైపు మొగ్గుచూపారు చిరంజీవి. ఇప్పుడు చరణ్ మిస్సయితే తిరిగి మహేష్ వైపు వెళ్లే అవకాశం ఉండదు. ఎందుకంటే తనను కాదనుకున్న తర్వాత మళ్లీ వస్తే మహేష్ చేయకపోవచ్చు. దీంతో పవన్ కల్యాణ్ సీన్ లోకి ఎంటరయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఇండస్ట్రీ జనాలు.