కరోనా పోవాలంటే… లాక్ డౌన్ పొడిగించాల్సిందే…

కరోనా పోవాలంటే.. లాక్ డౌన్ ను పొడిగించాల్సిందే అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. అలా అయితేనే.. కరోనా సమసిపోతుందని అభిప్రాయపడ్డారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రధాని మోదీతోనూ ఈ విషయం గురించి మాట్లాడతామన్న కేసీఆర్.. అందరు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లాంటి భేటీ నిర్వహించి తగిన నిర్ణయాన్ని తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తానని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా.. ప్రధాని మోదీకి తన అపరిమితమైన సంఘీభావాన్ని కేసీఆర్ వ్యక్తీకరించారు.  ప్రధాని అంటే ఓ వ్యవస్థ అని.. గౌరవించాల్సిన బాధ్యత ఉండాలని.. చులకనగా మాట్లాడవద్దని జనానికి చెప్పారు. దీపాలు వెలిగించాలని కోరితే.. మద్దతుగా నిలవాల్సిందిపోయి విమర్శలు చేసిన వాళ్లను.. కుసంస్కారులుగా అభివర్ణించారు.

తాను తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు.. జే గంటలు మోగించాల్సిందిగా ప్రజలను కోరితే.. ఉద్యమానికి అనూహ్య సంఘీభావం వ్యక్తమైందని గుర్తు చేసుకున్నారు. కరోనాపై ఇలాంటి పోరాటం చేస్తున్న క్రమంలో ఇలాంటి సంఘటిత చర్యలు తప్పనిసరి అని తేల్చారు. అందుకే తాను.. ప్రధానికి సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తున్నట్టు కేసీఆర్ తన విధానంలో మరింత స్పష్టత ఇచ్చారు. ఈ విషయంలో తాను విమర్శలు పట్టించుకునేది లేదని చెప్పారు.

ప్రజల ప్రాణాలే ముఖ్యమని.. ప్రజలు బాగుంటే రేపైనా సంపాదించుకోవచ్చని కేసీఆర్ చెప్పారు. అందుకే లాక్ డౌన్ పొడిగింపు ఉండాల్సిందే అన్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అనే అంతర్జాతీయ సంస్థ కూడా.. జూన్ 3 వరకూ లాక్ డౌన్ పొడిగించాలని నివేదిక ఇచ్చిందంటూ వ్యాఖ్యానించారు. అంతిమంగా చెప్పొచ్చేదేంటి అంటే.. మరో వారం తర్వాత లాక్ డౌన్ అయిపోతుంది అని ఎదురు చూసే తెలంగాణ ప్రజానీకం మాత్రం.. ఇంకో పది, పదిహేను రోజులు ఆగక తప్పని పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిందే. కరోనాపై జరుగుతున్న పోరులో వారూ ఇలా ఇంటికే పరిమితం కావాల్సిందే.