ఇది కేసీఆర్ గిఫ్ట్… వారికి రూ. 7500… వీరికి రూ.5000

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మరోసారి ప్రజల మనసు ఆకట్టుకునే చర్యను అమలు చేశారు. కరోనాపై వీరోచితంగా పోరాటం చేస్తున్న వారిని గౌరవించుకునే క్రమంలో.. సిబ్బందికి పూర్తి స్థాయి వేతనంతో పాటు.. ఇన్సెంటివ్స్ ను సీఎం గిఫ్ట్ రూపంలో ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎంత కష్టమైనా సరే.. అవసరమైతే వంద కోట్ల రూపాయలైనా సరే.. వెంటనే మంజూరు చేయిస్తామని.. వేరే ఖర్చులు ఆపి మరీ ఈ ప్రోత్సాహకాలు చెల్లిస్తామని వెల్లడించారు.

ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడుతున్న వైద్యులకు గ్రాస్ శాలరీలో 10 శాతం మొత్తాన్ని సీఎం గిఫ్ట్ గా అందించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. అలాగే.. రాష్ట్ర వ్యాప్తంగా కొందరు మున్సిపల్ కార్మికులకు వేతనాల్లో కోత పడిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఈ విషయంలో కార్మికులకు ఓ రకంగా సారీ చెప్పారు. ఆ కోతకు గురైన జీతాన్ని వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. ఆర్థిక శాఖ కార్యదర్శికీ ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు.

అంతే కాకుండా.. మున్సిపల్ కార్మికులకు సీఎం గిఫ్ట్ రూపంలో 5 వేల రూపాయలు, జీహెచ్ఎంసీ.. హెచ్ఎండబ్ల్యూఎస్ కార్మికులకు ఏకంగా 7 వేల 500 రూపాయల మొత్తాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు. డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలే.. ప్రజల ప్రాణాలకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయన్న సీఎం.. వారు ఇలాగే శ్రమించాలని కోరారు. వారికి ఇచ్చే ఈ మొత్తం తక్కువే అయినా.. అందరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.

కరోనా నియంత్రణ విధుల్లో భాగమైన ఇతర అన్ని వర్గాలనూ తాము గౌరవించుకుంటామని చెప్పారు. ప్రజలు సహకరిస్తే ఈ సమస్యను సులువుగా పరిష్కరించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు.