పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్!

కరోనా ఎప్పుడు పోతుందో తెలియదు…. కష్టం ఎప్పుడు తీరుతుందో తెలియదు. తమ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. అసలే సెలవులు. ఆపై లాక్ డౌన్. ఇలాంటి సమయంలో పదో తరగతి పరీక్షలకు సిద్ధంగా ఉన్న విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించగలం. పదే పదే చదువుకోలేక.. సెలవుల ప్రభావంతో చదివింది గుర్తుంచుకోలేక.. సరదాగా స్నేహితులతో మాట్లాడలేక.. వాళ్లు పడుతున్న ఇబ్బందులు….వారికే అర్థం కాకుండా ఉంటున్నాయ్. పరీక్షలు ఎప్పుడుంటాయన్నదే వారందరికీ అర్థం కాకుండా ఉంది.

ఇలాంటి వారికి చదువుపై శ్రద్ధ కొనసాగించేలా… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. రోజూ ఉదయం, సాయంత్రం… ఒక్కో గంట పాటు… టీవీల్లో పాఠాలు చెప్పించేందుకు నిర్ణయించింది. ఈ ప్రకారం.. దూరదర్శన్ సప్తగిరి చానల్ లో… ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు… అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు.. ఈ తరగతులు ప్రసారం అవుతాయి.

పరీక్షలకు సన్నద్ధం అయ్యే దిశగా విద్యార్థులను సిద్ధం చేసేందుకు.. ఈ పాఠాలు కీలకం కాబోతున్నాయి. ఇన్నాళ్లూ చదివి.. రివిజన్ చేసిన పాఠాలను.. అలా గంట పాటు నెమరు వేసుకుంటే.. మరింత కాలం పాటు సబ్జెక్ట్ ను ఒడిసి పట్టుకునే అవకాశం విద్యార్థులకు లభిస్తుంది. లాక్ డౌన్ పొడిగింపునకు అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. ఇలాంటి తరగతులు పదోతరగతి పరీక్షల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశం కానున్నాయి.

ఈ అవకాశాన్ని వినియోగించుకుని.. మంచి ఫలితాలు సాధించాలని ప్రభుత్వం కోరుకుంటోంది.