కేసీఆర్ మోడీని పొగిడారు… బీజేపీ నాయకులు ఇలా స్పందించారు…

కరోనా ప్రభావం తెలంగాణలో రోజు రోజుకూ పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో.. సహాయ చర్యల అమలు గురించి ఇటీవల వివరించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పనిలో పనిగా కొన్ని మీడియా సంస్థలపై పేర్లు వెల్లడించకుండానే.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆరోపిస్తూ.. వారికి కరోనా రావాలని కోరుకుంటున్నా అని శపిస్తూ.. రాజకీయ వేడిని రగిలించారు. ఇదే.. ఇప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలకు దారి కల్పించింది.

వాస్తవానికి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలకు.. ఆయన చెప్పే మాటలకు.. ప్రజల నుంచి మంచి స్పందనే వస్తోంది. కానీ.. ఆయన ప్రత్యర్థి నాయకులే దీన్ని ఓ అవకాశంగా తీసుకుంటున్నారు. ప్రధాని మోదీని వెనకేసుకు వస్తూ.. మోదీ చెప్పిన లైట్లు వెలిగించే ప్రక్రియను తప్పుబట్టినవారిని కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. మామూలుగా అయితే.. బీజేపీ నాయకులు ఈ చర్యను స్వాగతించాలి. కానీ.. స్వయానా వారే కేసీఆర్ తీరును తప్పుబడుతున్నారు.

నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్.. కేసీఆర్ ను తిడుతూ ట్వీట్ చేశారు. మోదీని కేసీఆర్ పొగిడితే ఎంత.. పొగడకపోతే ఎంత అని కామెంట్ చేశారు. మరోవైపు.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ…. మీడియాను తిట్టిన కేసీఆర్ తీరును తప్పుబట్టారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయంలో కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.

ఇదంతా చూస్తున్న టీఆర్ఎస్ అగ్ర నాయకులు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. తిట్టేవారిని ప్రజలే చూసుకుంటారు అన్నట్టుగా తమ పని తాము చేసుకుపోతున్నారు. ప్రజలు మాత్రం.. ఇలాంటి సమయంలో ఇవేం రాజకీయాలంటూ అసహనానికి గురవుతున్నారు.