పవన్ అడిగితే ఇచ్చేస్తా – చిరంజీవి

ఎప్పుడైతే పవన్ రీఎంట్రీ ఇచ్చాడో అప్పట్నుంచి మెగాస్టార్-పవర్ స్టార్ కాంబినేషన్ పై కథనాలు వస్తూనే ఉన్నాయి. కనీసం రీఎంట్రీలోనైనా వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే బాగుంటుందని మెగాభిమానులే కాదు, సగటు ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు అలాంటిదే మరో సందర్భం వచ్చింది.

ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న చిరంజీవి.. ఆ మూవీ తర్వాత లూసిఫర్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. మలయాళంలో సూపర్ హిట్టయిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు చిరు. మోహన్ లాల్ పోషించిన పాత్రలో చిరు కనిపిస్తారన్నమాట. అయితే ఇందులో మరో కీలకపాత్ర కూడా ఉంది. అదే పృధ్వీరాజ్ పోషించిన పాత్ర.

ఈ పాత్రను పవన్ కల్యాణ్ పోషిస్తే బాగుంటుందనే టాక్ ప్రస్తుతం నడుస్తోంది. ఈ మేరకు ఇండస్ట్రీలో కొన్ని గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మేటర్ చిరంజీవి వరకు కూడా వెళ్లింది. లూసిఫర్ రీమేక్ లో పవన్ నటించే ఛాన్స్ ఉందంటూ పుకార్లు వచ్చాయి. దీనిపై చిరంజీవి స్పందించారు. పవన్ నిజంగా లూసిఫర్ రీమేక్ లో నటించాలనుకుంటే.. ఆ రీమేక్ ప్రాజెక్టును పవన్ కు ఇవ్వడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.