అప్పుడు సత్యరాజ్… ఈసారి మోహన్ లాల్….

రాజమౌళి సినిమాల్లో హీరోహీరోయిన్లకే కాదు.. మిగతా నటులకు కూడా మంచి పాత్రలు దొరుకుతుంటాయి. ఉదాహరణకు బాహుబలి సినిమానే తీసుకుంటే.. ఆ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్కకు ఎంత పేరొచ్చిందో.. కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్, శివగామిగా నటించిన రమ్యకృష్ణకు కూడా అంతే పేరొచ్చింది. కట్టప్ప పాత్ర తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో స్టార్ అయిపోయాడు సత్యరాజ్. ఇప్పుడు అలాంటిదే మరో పాత్రను ఆర్ఆర్ఆర్ లో సృష్టించాడట రాజమౌళి.

ఆర్ఆర్ఆర్ లో ఇప్పటికే రెండు కీలక పాత్రలున్నాయి. అందులో ఒక పాత్రను సముత్తరఖని పోషిస్తున్నాడు. మరో పాత్రను అజయ్ దేవగన్ పోషిస్తున్నాడు. ఇప్పుడీ రెండు పాత్రలు కాకుండా మరో కీలక పాత్ర కూడా ఉందట. ఆ పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు.

సినిమాలో కొమరం భీమ్ పాత్రధారి ఎన్టీఆర్ కు మోహన్ లాల్ కు మధ్య మాత్రమే సన్నివేశాలు వస్తాయట. అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ కు, మోహన్ లాల్ పాత్రకు ఎలాంటి సంబంధం ఉండదనే టాక్ నడుస్తోంది. ఏదేమైనా సినిమాలో మోహన్ లాల్ పాత్ర అతడి కెరీర్ లో మరో మంచి క్యారెక్టర్ గా ఉండబోతోందనే టాక్ నడుస్తోంది.

అయితే ఈ మేటర్ లో నిజం ఎంతనేది ప్రస్తుతానికి సస్పెన్స్. దీనిపై రాజమౌళి క్లారిటీ ఇవ్వాల్సిందే. అన్నట్టు ఇంతకుముందు ఎన్టీఆర్-మోహన్ లాల్ కలిసి జనతాగ్యారేజ్ అనే సినిమా చేశారు. ఇప్పుడు మరోసారి ఆ కాంబో రిపీట్ కాబోతోందన్నమాట.