Telugu Global
International

ఆ ఏడుగురిలో ఈ ఇద్దరు!

సచిన్, కొహ్లీలకు క్లార్క్ హ్యాట్సాఫ్ ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్…తన దృష్టిలో ప్రపంచ క్రికెట్లోని ఏడుగురు అత్యుత్తమ బ్యాట్స్ మన్స్ ఎవరో బయటపెట్టాడు. తన దేశంలో జరిగిన ఓ చానెల్ బ్రేక్ ఫాస్ట్ షోలో పాల్గొన్న క్లార్క్…తన అనుభవాలను, తాను మెచ్చిన ప్రత్యర్థి ఆటగాళ్ల గురించి తన అభిప్రాయాలను వెల్లడించాడు. భారత క్రికెటర్ సచిన్ టెండుల్కర్, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కొహ్లీలపై ప్రశంసల వర్షం కురిపించాడు. బలహీనతలేని మొనగాడు సచిన్…. ప్రపంచ క్రికెట్లో దిగ్గజ బ్యాట్స్ […]

ఆ ఏడుగురిలో ఈ ఇద్దరు!
X
  • సచిన్, కొహ్లీలకు క్లార్క్ హ్యాట్సాఫ్

ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్…తన దృష్టిలో ప్రపంచ క్రికెట్లోని ఏడుగురు అత్యుత్తమ బ్యాట్స్ మన్స్ ఎవరో బయటపెట్టాడు. తన దేశంలో జరిగిన ఓ చానెల్ బ్రేక్ ఫాస్ట్ షోలో పాల్గొన్న క్లార్క్…తన అనుభవాలను, తాను మెచ్చిన ప్రత్యర్థి ఆటగాళ్ల గురించి తన అభిప్రాయాలను వెల్లడించాడు.

భారత క్రికెటర్ సచిన్ టెండుల్కర్, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కొహ్లీలపై ప్రశంసల వర్షం కురిపించాడు.

బలహీనతలేని మొనగాడు సచిన్….

ప్రపంచ క్రికెట్లో దిగ్గజ బ్యాట్స్ మన్ ల అందరికీ ఏదో ఒక బలహీనత ఉండితీరుతుందని, తనకు తెలిసిన క్రికెటర్లలో ఏ విధమైన లోపమూ, బలహీనతలేని ఒకే ఒక్క క్రికెటర్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ మాత్రమేనని క్లార్క్ తెలిపాడు.

కేవలం క్రికెట్ కోసమే…అదీ బ్యాటింగ్ కోసమే పుట్టిన ఆటగాడు ఎవరంటే సచిన్ పేరును మాత్రమే తాను ముందుగా చెబుతానని అన్నాడు. సచిన్ బ్యాట్ పట్టుకొని క్రీజులోకి వచ్చాడంటే…నిలదొక్కుకొన్నాడంటే…అతన్ని అవుట్ చేయడం చాలా కష్టమని గుర్తు చేసుకొన్నాడు. బౌలర్లు తమ అమ్ములపొదిలో ఉన్న అన్ని ఆయుధాలు ప్రయోగించినా సచిన్ అవుటయ్యేవాడుకాడనీ, తనకు తానుగా సచిన్ అవుటయ్యేవరకూ ఎంతటి గొప్పజట్టుకైనా వేచిచూడక తప్పని పరిస్థితి ఉండేదని తెలిపాడు.

అసాధారణ ఆటగాడు కనుకే సచిన్ 22 సంవత్సరాలపాటు భారత సమ్మోహక, జనరంజక క్రికెటర్ గా నిలువగలిగాడని, 200 టెస్టులు, 453 వన్డేలు ఆడటమే కాదు..100 సెంచరీలు, 30వేలకు పైగా పరుగులు సాధించగలిగాడని కంగారూ మాజీ కెప్టెన్ ప్రశంసించాడు.

త్రీ-ఇన్-వన్ విరాట్ కొహ్లీ…

ప్రస్తుత తరం క్రికెటర్లలో విరాట్ కొహ్లీ తర్వాతే ఎవరైనా అని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. సాంప్రదాయ టెస్ట్, ఇన్ స్టంట్ వన్డే క్రికెట్, ధూమ్ ధామ్ వన్డే క్రికెట్… ఫార్మాట్ ఏదైనా సరే.. ఒకే తీరుగా రాణించే మొనగాడు విరాట్ కొహ్లీ మాత్రమేనని క్లార్క్ కొనియాడాడు.

ఫార్మాట్ ఫార్మాట్ కు తన ఆటతీరును కొహ్లీ మలచుకొన్న తీరు అపూర్వమని అభివర్ణించాడు. తన దృష్టిలోని ఏడుగురు ఆల్ టైమ్ గ్రేట్ బ్యాట్స్ మన్ లో ఏబీ డివిలియర్స్, బ్రయన్ లారా, జాక్ కలిస్, రికీ పాంటింగ్, కుమార సంగక్కర, సచిన్ టెండుల్కర్, విరాట్ కొహ్లీ మాత్రమేనని తెలిపాడు.

ఆస్ట్ర్రేలియాకు రెండుసార్లు ప్రపంచకప్ లు అందించడంతో పాటు 115 టెస్టులు, 245 వన్డేలు, 34 టీ-20 మ్యాచ్ లు ఆడిన రికార్డు మైకేల్ క్లార్ కు ఉంది.

First Published:  8 April 2020 12:27 PM GMT
Next Story