మొన్న లూసిఫర్…. ఈసారి విక్రమ్ వేధ

పవన్ ఎప్పుడైతే రీఎంట్రీ ఇచ్చాడో అప్పట్నుంచి అతడి చుట్టూ పుకార్లు తిరగడం ప్రారంభమయ్యాయి. మొన్నటికిమొన్న లూసిఫర్ రీమేక్ లో పవన్ నటిస్తాడంటూ పెద్ద ప్రచారం సాగింది. చివరికి ఇది చిరంజీవి వరకు వెళ్లి, చిరు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. పవన్ కోరితే లూసిఫర్ రీమేక్ ను వదులుకుంటానని స్వయంగా చిరంజీవి ప్రకటించాల్సి వచ్చింది. ఇప్పుడు పవన్ ఖాతాలో మరో పుకారు చేరింది. ఈసారి విక్రమ్ వేధ సినిమా హాట్ టాపిక్ గా మారింది.

తమిళ్ లో సూపర్ హిట్టయిన సినిమా విక్రమ్ వేధ. మాధవన్, విజయ్ సేతుపతి నటించిన సినిమా ఇది. మూడేళ్ల కిందటొచ్చిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్టయింది. దీన్ని తెలుగులో రీమేక్ చేయాలని దాదాపు రెండేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్మాత రామ్ తళ్లూరి ఈ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్నట్టు చెబుతున్నారు.

పవన్ కు రామ్ తళ్లూరి మంచి స్నేహితుడు. సో.. ఈ రీమేక్ లో పవన్ ను హీరోగా నటింపజేయాలని రామ్ ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సినిమాలో విజయ్ సేతుపతి పోషించిన స్మగ్లర్ పాత్రను పవన్ తో చేయించాలని రామ్ చూస్తున్నాడట. ఇక మాధవన్ చేసిన పోలీసాఫీసర్ పాత్రను రవితేజతో చేయించాలని చూస్తున్నాడట.

విక్రమ్ వేధ రీమేక్ చుట్టూ ఇప్పటికే చాలామంది తెలుగు హీరోల పేర్లు వినిపించాయి. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు కొత్తగా పవన్ పేరు వినిపిస్తోంది. ఈసారి కూడా ఈ కాంబినేషన్ వర్కవుట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే, కాస్త నెగెటివ్ షేడ్స్ తో సాగే విజయ్ సేతుపతి పాత్రను పవన్ పోషించకపోవచ్చు.

అన్నట్టు ఈ సినిమా హిందీలో మాత్రం రీమేక్ కు రెడీ అవుతోంది. సైఫ్ అలీఖాన్, అమీర్ ఖాన్ ఈ రీమేక్ ప్రాజెక్టులో నటించబోతున్నారు. విజయ్ సేతుపతి పోషించిన స్మగ్లర్ పాత్రలో అమీర్ ఖాన్ కనిపించబోతున్నాడనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.