బ‌న్నీ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన కేర‌ళ సీఎం

తమ రాష్ట్రంలో కరోనా నిర్మూలనకు చేయూతనిచ్చిన అల్లు అర్జున్ ని ప్రత్యేకంగా అభినందించింది కేరళ సర్కార్. తెలుగు రాష్ట్రాలతో సమానంగా తమను కూడా ఆదుకోవాలన్న బన్నీ ఆలోచన గొప్పదంటూ ప్రశంసించారు కేరళ సీఎం పినరయి విజయన్. లాక్ డౌన్ ప్రకటన వెలువడగానే.. బన్నీ కోటి ఇరవై అయిదు లక్షలు విరాళం ప్రకటించారు.

ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు.. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి పాతిక లక్షలు అందజేశారు. తమకు అందిన సాయాన్ని ధృవీకరించింది కేరళ సర్కార్. బన్నీకి కేరళ ప్రజలు రుణపడివుంటారన్నారు కేరళ సీఎం విజయన్.

బన్నీకి తెలుగు రాష్ట్రాలకు ధీటుగా మలయాళ ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ వుంది. ఆయన సినిమాలకు కేరళలో కూడా చెప్పుకోదగ్గ వసూళ్లు వస్తాయి. అల్లు అర్జున్ నటించిన దాదాపు అన్ని సినిమాలూ మలయాళంలో కూడా రిలీజ్ అవుతాయి. అక్కడి ప్రేక్షకులు బన్నీని ముద్దుగా మల్లు అర్జున్ అని కూడా పిలుచుకుంటారు.

గతంలో.. ప్రతిష్టాత్మక పడవ పోటీలకు బన్నీని ముఖ్య అతిథిగా పిలిచి సత్కరించింది కేరళ సర్కార్. ఇప్పుడు కేరళలో కరోనా నివారణకు సాయం ప్రకటించి.. అక్కడి ప్రజలతో పాటు ప్రభుత్వం మెప్పును పొందారు అల్లు అర్జున్.