ఎన్టీఆర్ ను వదిలేసి మహేష్ తో త్రివిక్రమ్ వెళతాడా?

సాధారణంగా పెద్ద ఫ్లాప్ సినిమాను ఇచ్చిన దర్శకుడితో సినిమా చేయడానికి అగ్రహీరోలు తటపటాయిస్తుంటారు. మంచి ఫామ్ లో ఉండగా.. టాలీవుడ్ అగ్ర దర్శకుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ తీసిన ‘అజ్ఞాతవాసి’ ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. ఆ తరువాత త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి చాలా మంది హీరోలు వెనుకంజ వేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ధైర్యం చేశాడు. ‘అరవింద సమేత’ తీసి త్రివిక్రమ్ ను నిలబెట్టాడు.

ఎన్టీఆర్ అందించిన ప్రోత్సాహం.. ‘అరవింద సమేత’ విజయం నేపథ్యంలో త్రివిక్రమ్ లో విశ్వాసం నిండి తరువాత బన్నీతో తీసిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.

మరోవైపు హారిక హాసిని క్రియేషన్స్ కూడా ‘అజ్ఞాతవాసి’ నష్టాలను ‘అల వైకుంఠపురం’ లాభాలతో భర్తీ చేసింది.

ఇప్పుడు మళ్లీ త్రివిక్రమ్ తో హారిక హాసిని క్రియేషన్స్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను ప్లాన్ చేశారు. ఎన్టీఆర్, రాంచరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి అగ్రతారలతో ప్రాజెక్టులను వరుసలో పెట్టారు.

ప్రస్తుతం త్రివిక్రమ్.. ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేశాడు. ఇది ఇప్పటికే ప్రకటించారు కూడా..

అయితే తాజాగా మహేష్ బాబు తో రెండు యాడ్స్ చేయాలని ఆయన భార్య నమ్రత స్వయంగా త్రివిక్రమ్ ను కోరిందట.. తద్వారా వీరిద్దరి మధ్య గ్యాప్ ను పూడ్చి ఒక ఫ్లాట్ ఫాంపైకి తీసుకురావడానికి ఆమె ప్రయత్నాలు చేస్తోంది. దిల్ రాజు, హారిక హాసినితో కలిసి మహేష్ తో త్రివిక్రమ్ సినిమాను నమ్రత తెరపైకి తీసుకొచ్చిందట.

ఆర్ఆర్ఆర్ ఆలస్యం కానుండడంతో ఆ గ్యాప్ లో మహేష్ బాబుతో సినిమాను తీయాలని నమ్రత గట్టిగా త్రివిక్రమ్ పై ఒత్తిడి తెస్తోందట.. ఎన్టీఆర్ కు ఈ పరిణామం షాకింగ్ గా మారనుంది.

అయితే మహేష్ బాబుతో సినిమాకు త్రివిక్రమ్, హారికా హాసని ఒప్పుకునే పరిస్థితులు కనిపించడం లేదట.. వారు ఇదివరకే వెంకటేశ్ తో ఓ సినిమా అనుకున్నారు. అది ఆగిపోయింది. ఆ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారట.. దీంతో నమ్రత వ్యూహం.. దిల్ రాజ్ ప్రణాళికలు బూడిదలో పోసిన పన్నీరు కావడం ఖాయంగా కనిపిస్తున్నాయి.