పవన్ ఫ్యాన్స్ కు కరోనా దెబ్బ

చాన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు పవన్ కల్యాణ్. వకీల్ సాబ్ సినిమాతో థియేటర్లలోకి రావాలని చూస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. కానీ అంతలోనే కరోనా మహమ్మారి వచ్చింది. ఇండస్ట్రీని పడుకోబెట్టేసింది. కరోనా దెబ్బకు సినిమాలన్నీ వాయిదాపడ్డాయి. దీనికి వకీల్ సాబ్ కూడా అతీతం కాదు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే మే 15న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్. కానీ కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తున్నప్పటికీ కీలకమైన షెడ్యూల్ షూటింగ్ ఆగిపోవడంతో.. తప్పనిసరి పరిస్థితుల మధ్య సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు నిరాశలో కూరుకుపోయారు.

తమ అభిమాన నటుడ్ని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామా అని ఎదురుచూసిన పవన్ ఫ్యాన్స్ కు కరోనా అడ్డుకట్ట వేసింది. తాజా సమాచారం ప్రకారం.. మే 15 నుంచి ఈ సినిమాను తప్పించి ఏకంగా ఆగస్ట్ కు పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. ఆగస్ట్ లో మంచి తేదీ చూసి, కుదిరితే పంద్రాగస్ట్ నాడు వకీల్ సాబ్ ను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అంజలి, నివేత థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. పింక్ కు రీమేక్ గా ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే..