Telugu Global
National

కరోనా సేవలో భారత క్రీడాదిగ్గజాలు

కేరళలో సాకర్ స్టార్ వినీత్ హర్యానాలో క్రికెటర్ జోగిందర్ బరోడాలో పఠాన్ బ్రదర్స్ ప్రపంచ వ్యాప్తంగా 204 దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దెబ్బతో ప్రభుత్వాలు, ప్రపంచ అధినేతలు, ధనికులు, పేదవారు… ఒకరేమిటి, వారు, వీరు అన్న తేడాలేకుండా కోట్లాదిమంది జనం అల్లాడిపోతున్నారు. భారత్ లో మూడువారాల లాక్ డౌన్ కే జనజీవనం స్తంభించిపోయింది. ఎవరికివారే ఇంటిపట్టునే ఉంటున్నా కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య సైతం రోజురోజుకూ పెరిగిపోతూ వస్తోంది. పేదవారికి, కష్టాలలో ఉన్నవారికి […]

కరోనా సేవలో భారత క్రీడాదిగ్గజాలు
X
  • కేరళలో సాకర్ స్టార్ వినీత్
  • హర్యానాలో క్రికెటర్ జోగిందర్
  • బరోడాలో పఠాన్ బ్రదర్స్

ప్రపంచ వ్యాప్తంగా 204 దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దెబ్బతో ప్రభుత్వాలు, ప్రపంచ అధినేతలు, ధనికులు, పేదవారు… ఒకరేమిటి, వారు, వీరు అన్న తేడాలేకుండా కోట్లాదిమంది జనం అల్లాడిపోతున్నారు.

భారత్ లో మూడువారాల లాక్ డౌన్ కే జనజీవనం స్తంభించిపోయింది. ఎవరికివారే ఇంటిపట్టునే ఉంటున్నా కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య సైతం రోజురోజుకూ పెరిగిపోతూ వస్తోంది.

పేదవారికి, కష్టాలలో ఉన్నవారికి ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు సేవాసంస్థలు తమవంతుగా సేవలు అందిస్తుంటే…వివిధ క్రీడలకు చెందిన ప్రముఖ క్రీడాకారులు సైతం మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు. సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, సురేశ్ రైనా లాంటి క్రికెటర్లు భారీగా విరాళాలు అందిస్తే… మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ పోలీసు అధికారిగాను, భారత సాకర్ స్టార్ సీకె వినీత్ ఓ హెల్ప్ లైన్ ప్రతినిధిగాను, పఠాన్ బ్రదర్స్ ఇర్ఫాన్, యూసుఫ్…పేదవర్గాల ప్రజలకు మాస్క్ లు, ఆహారపదార్థాలు అందిస్తూ…మానవసేవే మాధవ సేవ అంటూ చాటుకొంటున్నారు.

బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ వ్యక్తిగత హోదాలో…బెంగాల్ లోని నిరుపేదలకు 50 లక్షల రూపాయల విలువైన బియ్యం అందచేశాడు. పంజాబీ పుత్తర్ హర్భజన్ సింగ్…జలంధర్ లోని 3వేల మంది నిరుపేదల కుటుంబ అవసరాలకు సరిపడిన నిత్యావసర వస్తువులు అందిస్తున్నాడు.

ముంబై మురికివాడల్లోని నిరుపేదలకు నెలకు 5వేల మందికి ఆహారం సమకూర్చనున్నట్లు మాస్టర్ సచిన్ టెండుల్కర్ ఇప్పటికే ప్రకటించాడు.

బరోడాలో పఠాన్ బ్రదర్స్…

బరోడా బాంబర్స్ కమ్ బ్రదర్స్ ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్… కరోనా వైరస్ బాధితులకు, లాక్ డౌన్ తో జీవనోపాధి కోల్పోయినవారికి తమవంతుగా సాయం చేస్తున్నారు.

బరోడా పోలీసుల ద్వారా ఇప్పటికే 4వేల కరోనా వైరస్ నిరోధక మాస్క్ లను పంచి పెట్టారు. అంతేకాదు.. నిరుపేద కుటుంబాలకు బియ్యం, బంగాళా దుంపలు అందిస్తున్నారు.

కన్ననూరులో వినీత్ సేవ…

భారత ఫుట్ బాల్ స్టార్, ఇండియన్ సాకర్ లీగ్ లో జంషెడ్ పూర్ ఫుట్ బాల్ క్లబ్ స్టార్ ప్లేయర్ సీకె. వినీత్… స్వస్థలం కన్ననూరుకు తిరిగి వచ్చిన వెంటనే తన కంప్యూటర్, సెల్ ఫోన్ సాయంతో సహాయకార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నాడు.

కోవిడ్-19 సహాయ కేంద్రాలతో సమన్వయం చేసుకొంటూ కన్ననూరు జిల్లాలో అవసరమైన వారికి ఆహార, వైద్య సదుపాయాలు అందటంలో వినీత్ ప్రముఖపాత్ర పోషిస్తున్నాడు. పగలు, రాత్రి అన్నతేడాలేకుండా కష్టపడుతున్నాడు.
కష్టాలు, విపత్తులు ఎదురైన సమయంలో ఉన్నవారు, లేనివారు, పెద్దవారు, చిన్నవారు అన్న తేడానే ఉండదని, కష్టాలలో ఉన్నవారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరి పైన ఉందని వినీత్ చెబుతున్నాడు.

2018లో కేరళ వరదల్లో చిక్కుకొన్న సమయంలో సైతం తాను వాలంటీర్ గా సేవలు అందించినట్లు వినీత్ గుర్తు చేసుకొన్నాడు. ఆ అనుభవం ప్రస్తుతం చక్కగా ఉపయోగపడుతోందని, సహాయం చేయండంటూ రోజుకు 200 వరకూ ఫోన్ కాల్స్ కన్ననూర్ జిల్లా నలుమూలల నుంచి తనకు వస్తున్నాయని, వారందరికీ కూరగాయలు, మందులు, నిత్యావసర సరుకులు అందేలా తనవంతుగా కృషి చేస్తున్నట్లు తెలిపాడు.

24 గంటల డ్యూటీలో జోగిందర్…

మరోవైపు…హర్యానా పోలీసు శాఖలో డీఎస్పీగా పనిచేస్తున్న మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ..రోహ్ తక్ ప్రాంతంలో లాక్ డౌన్ విధులను పర్యవేక్షిస్తున్నాడు.

తన పర్యవేక్షణలోని సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ విధులు నిర్వర్తిస్తుంటే…పై స్థాయి అధికారిగా తాను మాత్రం 24 గంటల డ్యూటీ చేస్తున్నానని, ఇది తన బాధ్యతని జోగిందర్ తెలిపాడు.

క్రికెటర్ గా గ్రౌండ్ లోకి దిగితే ఎంత బాధ్యతగా ,అంకితభావంతో ఆడుతామో…పోలీసు అధికారిగా విధులను అదే అంకితభావంతో నిర్వర్తిస్తున్నట్లు తెలిపాడు.

కష్టాలలో ఉన్న సమయంలో ప్రజలకు సేవచేయటానికి మించిన భాగ్యం మరొకటిలేదని జోగిందర్ అంటున్నాడు.

వివిధ రాష్ట్రాల పోలీసు శాఖల్లో ఉద్యోగులుగా ఉన్న పలువురు క్రీడాకారులు సైతం… కరోనా లాక్ డౌన్ విధుల్లో, సేవాకార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ… సేవంటే ఇదేరా అనిపించుకొంటున్నారు.

First Published:  11 April 2020 6:24 AM GMT
Next Story