సిద్దిపేటలో రౌడీషీటర్ హత్య? దొంగ నోట్ల ముఠా పనేనా?

సిద్ధిపేట జిల్లాలో రౌడీషీటర్‌ అంబటి ఎల్లంగౌడ్‌ దారుణహత్యకు గురయ్యాడు. చిన్నకోడూరు మండలం రామంచ శివారులో ఈ ఘటన జరిగింది. అత్యంత కిరాతకంగా దుండగులు తల నరికి చంపేశారు. తలతోపాటు కుడి చేతిని నరికి మొండెం నుంచి వేరు చేశారు.

ఎల్లంగౌడ్‌ది సిద్దిపేట మండలం ఇమామ్‌బాద్‌. ఇతను‌ పలు కేసుల్లో నిందితుడు. దొంగ నోట్ల కేసులో కీలక సూత్రధారి. ఎల్లంగౌడ్‌ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఇటు ఎల్లంగౌడ్‌ను నరికి చంపింది తామేనంటూ ముగ్గురు వ్యక్తులు సిద్ధిపేట పోలీసుల ముందు లొంగిపోయారు. వారిని తడకపల్లి వెంకట్‌ గ్యాంగ్‌గా గుర్తించారు. దొంగనోట్ల వ్యాపారంలో ఎల్లంగౌడ్‌ పార్టనర్‌గా ఉండేవాడు వెంకట్. ‌

తెలంగాణలో 16 దొంగనోట్ల కేసులు.. కర్నాటకలో మరో నాలుగు కేసుల్లో ఎల్లంగౌడ్‌ నిందితుడు. 2014 శామీర్‌పేట్‌లో పోలీసులపై దాడి కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. దొంగనోట్లు ముద్రించడంతో పాటు చెలామణీ చేసేవాడు.

2014లో శామీర్‌పేటలో పోలీసులు ఎల్లంగౌడ్ ముఠాను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించారు. బాలాజీనగర్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ వెంకటరెడ్డి తన సిబ్బందితో కలిసి డెకాయి ఆపరేషన్‌ నిర్వహించారు. దొంగనోట్ల ముఠా సభ్యులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కత్తులతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌ మృతిచెందారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఎల్లంగౌడ్‌ అనుచరుడు మరణించాడు. ఆ సమయంలో ఎల్లంగౌడ్‌ పరారయ్యాడు. అతనికోసం అప్పటి సైబరాబాద్‌ సీపీ 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.

ఎల్లంగౌడ్‌ కోసం గాలిస్తున్న సమయంలోనే చైన్‌స్నాచర్‌ శివ ఎన్‌కౌంటర్‌ జరిగింది. అదే సమయంలో ఎల్లంగౌడ్‌ను హెచ్చరించారు పోలీసులు. దీంతో తనకు తానుగా వచ్చి లొంగిపోయాడు. ఓ తుపాకీ, 69వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఎల్లంగౌడ్‌ ముఠా ఆయుధాలను బీహార్‌ నుంచి తీసుకొచ్చేవారు. అయితే తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్లు.. తన ముఠా సభ్యుల చేతుల్లోనే హతమయ్యాడు అంబటి ఎల్లంగౌడ్‌. లావాదేవీల్లో తేడాలు రావడంతో హత్య చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది.