Telugu Global
NEWS

కరోనాతో జీవితం నాశనం కాదు.... వివక్ష చూపడం మాని సమాచారం ఇవ్వండి

కరోనా వస్తే జీవితం నాశనమైపోతుందన్న భయం నుంచి ప్రజలు బయటకు రావాలని పిలుపునిచ్చారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి. సాయంత్రం ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన… వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనాతో కలిసి జీవనం సాగించాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. అందుకు తగ్గట్టుగా సన్నద్దం కావాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా సోకిన వారిపై వివక్ష చూపవద్దని కోరారు. కరోనా అన్నది ఎవరికైనా రావొచ్చునని… తనకూ రావొచ్చునని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కాబట్టి కరోనా సోకిన వారిపై వివక్ష చూపడం మాని… […]

కరోనాతో జీవితం నాశనం కాదు.... వివక్ష చూపడం మాని సమాచారం ఇవ్వండి
X

కరోనా వస్తే జీవితం నాశనమైపోతుందన్న భయం నుంచి ప్రజలు బయటకు రావాలని పిలుపునిచ్చారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి. సాయంత్రం ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన… వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనాతో కలిసి జీవనం సాగించాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. అందుకు తగ్గట్టుగా సన్నద్దం కావాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా సోకిన వారిపై వివక్ష చూపవద్దని కోరారు. కరోనా అన్నది ఎవరికైనా రావొచ్చునని… తనకూ రావొచ్చునని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కాబట్టి కరోనా సోకిన వారిపై వివక్ష చూపడం మాని… తక్షణం వైద్యులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అలా చేస్తే వైద్యులు వచ్చి తీసుకెళ్లి సరైన చికిత్స అందిస్తారని సీఎం సూచించారు.

ప్రస్తుతం రోజుకు ఆరువేల ఐదు వందల పరీక్షలు చేసే స్థాయికి ఏపీ చేరుకుందన్నారు. దేశంలో అత్యధిక పరీక్షలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమేనన్నారు. ప్రతి పది లక్షల మందికి దేశంలో 451 మందికి పరీక్షలు చేస్తుంటే… ఏపీలో మాత్రం 1,396 మందికి పరీక్షలు చేస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు 74వేల 551 పరీక్షలు చేయగలిగామన్నారు.

రాష్ట్రం 80 శాతం గ్రీన్‌ జోన్‌లోనే ఉందని వివరించారు. 676 మండలాలు ఉండగా 63 మండలాలు మాత్రమే రెడ్‌జోన్‌లో ఉన్నాయన్నారు. 54 మండలాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయని… మిగిలిన 559 మండలాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అవన్నీ గ్రీన్‌జోన్‌లో ఉన్నాయని సీఎం వివరించారు.

ఈ నెల రోజుల్లో ఆస్పత్రులన్నింటిని సిద్ధం చేసుకోగలిగామన్నారు. కరోనా వైద్యం కోసం ఐదు క్రిటికల్ కేర్ ఆస్పత్రులను సిద్ధం చేశామన్నారు. ప్రతి జిల్లాలోనూ కరోనా కోసం ప్రత్యేకంగా సిద్ధం చేశామన్నారు. క్వారంటైన్ లో ఉండే వారి కోసం అత్యధికంగా సింగిల్ రూం బెడ్‌లను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 40వేల బెడ్స్ ఉండగా 25వేల బెడ్స్‌ సింగిల్‌ రూములేనని వివరించారు. క్వారంటైన్ సెంటర్లలో అన్ని వసతులు కల్పిస్తున్నట్టు చెప్పారు.

పీపీఈలు, ఎన్‌ -95 మాస్కులు సంవృద్ధిగా ప్రతి ఆస్పత్రిలోనూ రెడీ చేసుకోగలిగామన్నారు. కోవిడ్ ఆస్పత్రుల్లో అదనంగా డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్ ల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. నెల రోజుల్లో మూడు సార్లు రేషన్ ఇస్తున్నామని… ఆదాయం పూర్తిగా పడిపోయినా సామాన్యులకు ఇబ్బంది రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఇంటికి వెయ్యి రూపాయలు ఇవ్వగలిగామన్నారు. ఇతర జబ్బులకు అవసరమైన మందులు ఇంటి వద్దకే వచ్చి అందించేలా టెలిమెడిసిన్ వ్యవస్థను కూడా తీసుకొచ్చామన్నారు.

రాష్ట్రంలోని ప్రతి ఇంటిని మూడు సార్లు సర్వే చేశామన్నారు. దాని వల్ల అనుమానిత కేసులను గుర్తించడం ఈజీ అయిందన్నారు. అయినప్పటికీ వైరస్‌ను పూర్తిగా నియంత్రించడం సాధ్యమయ్యే పని కాదన్నారు. రాబోయే రోజుల్లో కరోనాతో కలిసి జీవించే పరిస్థితి ఉండవచ్చన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాల్సి ఉంటుందన్నారు. కరోనా భయంకరమైన రోగమన్న భావనను ప్రజలు విడిచిపెట్టాలన్నారు. కరోనా వచ్చిన వెంటనే జాగ్రత్తలు తీసుకుంటే, వైద్యం చేయించుకుంటే నయమైపోతుందన్నారు.

80 శాతం మందిలో కరోనా వచ్చి వారికి తెలియకుండానే నయమైపోతున్న పరిస్థితి ఉందన్నారు. కేవలం 14 శాతం మాత్రమే ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. చనిపోయిన వారి సంఖ్య కేవలం ప్రపంచం మొత్తం మూడు నాలుగు శాతమే ఉందన్నారు. కరోనా వచ్చిందని చెప్పుకుంటే అంటరానివారం అవుతామేమో అన్న భావనను ప్రజలు వదిలేయాలన్నారు. కరోనా ఎవరికైనా రావొచ్చనని, తనకు కూడా రావొచ్చునని జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా పరీక్షల్లో నమోదు అవుతున్న కరోనా కేసుల సంఖ్య నాలుగు శాతంగా ఉందని… ఏపీలో మాత్రం కరోనా కేసుల సంఖ్య 1.6 శాతంగా మాత్రమే ఉందన్నారు. కరోనా వల్ల అతిగా భయపడవద్దని… కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది ఉండదన్నారు. ప్రతి ఒక్కరికి మూడు మాస్కులను ప్రభుత్వం తరపున అందజేస్తున్నట్టు చెప్పారు.

కరోనా సోకితే సిగ్గుపడాల్సిన పని లేదని… ఒక్క ఫోన్ చేస్తే వైద్యులే వచ్చి తీసుకెళ్లి వైద్యం అందిస్తారని వివరించారు. వయసులో పెద్దవారి విషయంలో మాత్రం కరోనా ప్రభావం అధికంగా ఉంటోందని… వారి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని కోరారు. మనిషికి మనిషికి దూరం పాటిస్తూ పనులు చేసుకుంటూ జీవనం సాగించాల్సిన అవసరం ఉందన్నారు. రెడ్‌జోన్లు, ఆరెంజ్ జోన్లలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

భారీగా పరీక్షలు చేస్తుండడంతో కేసులు కాస్త ఎక్కువగా బయటపడుతున్నాయన్నారు. ఈ పరీక్షలు 70 శాతం హాట్ జోన్స్‌లో చేసినవని… ఇంత తీవ్రమైన జోన్ లలో పరీక్షలు చేసినా 1.6 శాతం మాత్రమే పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయన్నారు. దేశం మొత్తం మీద కేసుల నమోదు 4 శాతంగా ఉందన్నారు. ఏపీలో వైరస్‌ ప్రభావం తక్కువగానే ఉందన్నారు.

కరోనా వల్ల దేశ వ్యాప్తంగా చనిపోతున్న వారి శాతం 3.13 శాతం ఉందన్నారు. ఏపీలో మాత్రం మరణాల రేటు 2.38 శాతంగా ఉందన్నారు. జాతీయ సగటు కంటే ఏపీలో మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉందన్నారు. చాలా విషయాల్లో భగవంతుడి ఆశీస్సుల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు మంచే జరుగుతోందన్నారు. ప్రజలు కూడా కుటుంబం కోసమే కాకుండా రాష్ట్రం కోసం కూడా భగవంతుడిని ప్రార్థించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

First Published:  27 April 2020 9:30 AM GMT
Next Story