Telugu Global
National

ఎనిమిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి నిర్ణయం

రాష్ట్రంలో సరైన మౌలికసదుపాయాలు లేకపోవడంతో మత్స్యకారులు చాలా మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. గుజరాత్‌ వరకు వెళ్లి అక్కడ చేపల వేటలో కూలీలుగా పనిచేస్తున్నారు. అలా ఏపీకి చెందిన మత్స్యకారులు పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పని లేకుండా చేసేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో ఎనిమిది చోట్ల మేజర్ ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఒక చోట ఫిష్ ల్యాండింగ్ కేంద్రాన్ని నిర్మించనున్నారు. వీటి నిర్మాణం వల్ల […]

ఎనిమిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి నిర్ణయం
X

రాష్ట్రంలో సరైన మౌలికసదుపాయాలు లేకపోవడంతో మత్స్యకారులు చాలా మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. గుజరాత్‌ వరకు వెళ్లి అక్కడ చేపల వేటలో కూలీలుగా పనిచేస్తున్నారు. అలా ఏపీకి చెందిన మత్స్యకారులు పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పని లేకుండా చేసేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్దం చేస్తోంది.

ఇందులో భాగంగా ఏపీలో ఎనిమిది చోట్ల మేజర్ ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఒక చోట ఫిష్ ల్యాండింగ్ కేంద్రాన్ని నిర్మించనున్నారు. వీటి నిర్మాణం వల్ల సముద్ర ఉత్పత్తులకు మరింత విలువ వస్తుంది. ఏపీ నుంచి మత్స్యకారులు కూలీ పని కోసం వలస వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే వీటిని నిర్మిస్తున్నారు.

వీటి నిర్మాణం పై గురువారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎనిమిది మేజర్ ఫిషింగ్ హార్బర్లు, ఒక ఫిష్ ల్యాండింగ్ కేంద్రం ఏర్పాటుకు మూడు వేల కోట్లు ఖర్చు అవుతుంది. వీటి నిర్మాణాలను రెండున్నర నుంచి మూడేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఎనిమిది చోట్ల చేపల వేటకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

శ్రీకాకుళం జిల్లా బడగట్ల పాలెంలో మేజర్ ఫిషింగ్ హార్బర్‌తో పాటు అదే జిల్లాలో మంచినీళ్లపేటలో ఫిష్ ల్యాండింగ్ కేంద్రాన్ని నిర్మిస్తారు. విశాఖ జిల్లా పూడిమడక వద్ద, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, గుంటూరుజిల్లా నిజాంపట్నం, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద మేజర్ ఫిషింగ్ హార్బర్లు నిర్మించనున్నారు.

వీటి నిర్మాణం పూర్తయితే ఏపీ నుంచి మత్స్యకారులు వలస వెళ్లాల్సిన పరిస్థితే ఉండదని… మత్స్యకారుల జీవితాల్లో మంచి మార్పులు వస్తాయని మంత్రి మోపిదేవి వెంకటరమణ అభిప్రాయపడ్డారు.

First Published:  30 April 2020 10:28 PM GMT
Next Story