గద్వాల మహిళ గర్భం మాయమైందని ప్రచారం… అయితే…

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ వింత ప్రచారం మొదలైంది. ఓమహిళ గర్భం మాయమైందని ఓ వార్త బాగా వైరల్‌ అయింది. పెద్దపోతుపాడు గ్రామానికి చెందిన మానసకు చిన్ పోతుపాడుకు చెందిన వెంక‌టేశ్‌తో ఆరేళ్ల కిందట పెళ్లి అయింది. గత ఏడాది ఆమె నెల తప్పింది. అయితే మొదట్లో స్థానికంగా ఉండే ఆశావర్కర్ ఆమెకు పరీక్షలు జరిపింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి నెలనెలా మందులు ఇప్పించింది.

శనివారం రాత్రి ఆమెకు తొమ్మిది నెలలు నిండాయి. నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో ఉండేందుకు మానస ఒప్పుకోలేదు. త‌న‌కు దేవుడు పూనాడ‌ని కేక‌లు వేసింది. తాను అక్కడ ఉండనని.. ఇంటికి వెళతానని సిబ్బందితో గొడవకు దిగింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఇంటికి తీసుకు వెళ్లారు.

ఆదివారం ఉదయం లేచి చూస్తే కుటుంబ సభ్యులు‌ షాక్ అయ్యారు. ఆమెకు గర్భం లేదు. కుటుంబసభ్యులు గర్భం ఏమైందని ప్రశ్నిస్తే…దేవుడు వచ్చి తీసుకెళ్లాడని మానస చెబుతోంది. గర్భం ఏమైందని అనుమానం వచ్చిన వారు మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ దివ్య ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

గత ఏడు నెలల నుంచి ఆమెకు పరీక్షలు చేశామని… ఆమె గర్భవతి అని డాక్టర్‌ చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితిని గమనిస్తే ఆమె డెలవరీ అయినట్లుగానీ… అబార్షన్‌ అయినట్లుగానీ లేదని ఆమె అంటున్నారు. స్కానింగ్ చేస్తే గానీ అస‌లు నిజం తెలియ‌ద‌న్నారు.

ప్రస్తుతం పాత పాలమూరు జిల్లాలో ఈ వార్త హాట్ టాఫిక్‌గా మారింది. గ‌ర్భం ఎలా మాయ‌మ‌వుతుంద‌ని, ఆమె చెప్పేదంతా అబ‌ద్దం అని కొంద‌రు వాదిస్తున్నారు.

అయితే పెళ్లి అయి ఆరేళ్లు కావడంతో అత్తింటివారితో పాటు ఇతరుల సూటిపోటి మాటలు భరించలేని మానస…తనకు గర్భం వచ్చిందని తొమ్మిది నెలలుగా డ్రామా ఆడి ఉండవచ్చనేది మరికొందరి వాదన. అయితే ఆమెకు ఏడు నెలలుగా డాక్టర్లు ఎలా చికిత్స చేశారనేది మరో మిస్టరీ.