Telugu Global
National

లాక్‌డౌన్‌లో పుట్టిన కొడుకు... చూడటానికి 1800 కి.మీల సైకిల్ ప్రయాణం చేస్తున్న తండ్రి

దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ కారణంగా పలు చోట్ల చిక్కుకొని పోయిన వలస కార్మికులు, కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న చోట పనులు దొరకక, ఉపాధిలేక స్వగ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. ఎవరిని కదిలించినా.. ఒక్కో దీనగాథ వినబడుతోంది. ఎలాగైనా సరే స్వగ్రామాలకు వెళ్లాలని.. నడక మార్గం ఎంచుకుంది కొందరైతే.. వందల కిలోమీటర్లు సైకిల్ పైనే వెళ్తున్న వారు మరికొందరు. బీహార్‌లోని గొరఖ్‌పూర్‌కు చెందిన లాల్‌దేవ్ ఏపీలోని విజయవాడకు వలస వచ్చాడు. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేటు సంస్థలో […]

లాక్‌డౌన్‌లో పుట్టిన కొడుకు... చూడటానికి 1800 కి.మీల సైకిల్ ప్రయాణం చేస్తున్న తండ్రి
X

దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ కారణంగా పలు చోట్ల చిక్కుకొని పోయిన వలస కార్మికులు, కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న చోట పనులు దొరకక, ఉపాధిలేక స్వగ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. ఎవరిని కదిలించినా.. ఒక్కో దీనగాథ వినబడుతోంది. ఎలాగైనా సరే స్వగ్రామాలకు వెళ్లాలని.. నడక మార్గం ఎంచుకుంది కొందరైతే.. వందల కిలోమీటర్లు సైకిల్ పైనే వెళ్తున్న వారు మరికొందరు.

బీహార్‌లోని గొరఖ్‌పూర్‌కు చెందిన లాల్‌దేవ్ ఏపీలోని విజయవాడకు వలస వచ్చాడు. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేటు సంస్థలో పని చేసే వీళ్లను సరిగ్గా లాక్‌డౌన్‌కు ముందు విజయవాడకు పంపించింది. విజయవాడకు చేరుకున్న తర్వాత కొన్ని రోజులకే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. ఆ లాక్‌డౌన్ సమయంలోనే లాల్‌దేవ్‌కు కొడుకు పుట్టాడనే విషయం తెలిసింది. కానీ సొంతూరుకు వెళ్లలేని పరిస్థితి. అతనితో పాటు ఉన్న హరిలాల్‌ అనే వ్యక్తికి కూతురు పుట్టి అప్పటికి మూడు నెలలు. చిన్నారులిద్దరూ సొంతూర్లో ఉండగా.. ఈ తండ్రులు మాత్రం విజయవాడలో చిక్కుకొని పోయారు. వీరితో మరో ఇద్దరు కూడా కలిసే ఉన్నారు. ఇప్పుడు వీరందరూ స్వగ్రామాలకు బయలుదేరారు.

ఈ నలుగురి వద్ద లాక్‌డౌన్ ప్రారంభ సమయానికి రూ.40 వేలు ఉన్నాయి. గత నెలన్నరగా తిండి, ఇతర ఖర్చుల కోసం రూ.10వేల వరకు ఖర్చు చేశారు. ఇలాగే ఇంకొన్ని రోజులు ఉంటే ఇండ్లకు చేరడం కష్టమవుతుందని అనుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లలో ప్రయాణానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా వీరికి మాత్రం అవకాశం రాలేదు. దీంతో తమ దగ్గర ఉన్న సొమ్ముతో రూ.5 వేలకు ఒక సైకిల్ చొప్పున నాలుగు సైకిళ్లు కొన్నారు. విజయవాడ నుంచి 1800 కిలోమీటర్ల దూరం ఉన్న గొరఖ్‌పూర్‌కు బయలుదేరారు.

ఆరు రోజుల క్రితం విజయవాడలో బయలుదేరిన ఈ నలుగురు విశాఖపట్నం మీదుగా ఒడిషా రాజధాని భువనేశ్వర్ చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొంటుండగా మీడియా ప్రతినిధులు వారితో ముచ్చటించారు. విజయవాడ నుంచి బయలు దేరిన తర్వాత కొంత మంది ట్రక్ డ్రైవర్లు లిఫ్ట్ ఇవ్వడంతో 250 కిలోమీటర్లు ప్రయాణం చేశామని.. మరో 500 కిలోమీటర్లు సొంతగానే సైకిల్ తొక్కుకుంటూ వచ్చామని.. ఇప్పటికైతే 800 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాం.. స్వగ్రామాలకు చేరాలంటే మరో వెయ్యి కిలోమీటర్లు వెళ్లాలని అన్నారు. దారిలో ఎవరైనా మంచి మనసున్న ట్రక్ డ్రైవర్లు దొరికితే లిఫ్ట్ తీసుకుంటాం. లేదంటే ఇలాగే సైకిల్ తొక్కుకుంటూ వెళ్తాం అని లాల్ చెప్పుకొచ్చాడు.

అయితే బయట నుంచి వచ్చే వారిపట్ల స్థానికులు అనుమానంతో చూస్తుండటంతో భువనేశ్వర్‌లో ఎక్కువ సేపు ఉండలేకపోయామని.. అందుకే ఎందుకైనా మంచిదని జంషెడ్‌పూర్ వైపు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామని వాళ్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధన ప్రకారం మమ్మల్ని ఎక్కడ క్వారంటైన్‌లో పెడతారో అనే భయం కూడా ఉంది. కానీ సొంత ఊరికి చేరాక క్వారంటైన్ అవుతాము. మధ్యలో ఆగిపోతే చాలా కష్టమేనని వాళ్లంటున్నారు.

ఇక సైకిళ్లపై, కాలినడకన సొంతూర్లకు ప్రయాణమవుతున్న వారికి దారిలో సహాయం చేస్తున్న కళ్యాణ్ ఆనంద్ అనే వాలంటీర్ మాట్లాడుతూ.. ప్రతీ రోజు కనీసం 25 బృందాలనైనా ఈ ఎన్‌హెచ్ 16పై చూస్తున్నానని.. ఆకలిదప్పులకు తట్టుకోలేకే వాళ్లు స్వగ్రామాలకు వెళ్తున్నట్లు తనకు చెబుతున్నారని ఆయన అన్నారు. నా వంతుగా అలా ప్రయాణమవుతున్న వారికి ఆహారం, రవాణా ఏర్పాటు చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.

First Published:  12 May 2020 12:33 AM GMT
Next Story