లాక్ డౌన్ ఫ్రీ టైమ్ చిరంజీవికి అంకితం

ఈ లాక్ డౌన్ ఫ్రీ టైమ్ ను మెగాస్టార్ చిరంజీవికి అంకితం చేశానంటున్నాడు దర్శకుడు బాబి. అవును.. లాక్ డౌన్ మొదలైనప్పట్నుంచి ఇప్పటివరకు చిరంజీవి స్క్రిప్ట్ పనిమీదే ఉన్నానని క్లారిటీ ఇచ్చాడు. ఆమధ్య దర్శకుడు బాబి, చిరంజీవిని కలిసి సంగతి తెలిసిందే. ఓ స్టోరీ లైన్ చెప్పాడు. ఆ స్టోరీ చిరంజీవికి చాలా బాగా నచ్చింది. ఎంత నచ్చిందంటే.. బాబి చెప్పిన స్టోరీ చాలా బాగుందని, అతడితో సినిమా చేస్తానని స్వయంగా చిరంజీవి మీడియా ముఖంగా ప్రకటించేశాడు.

ఇలా తనపై చిరంజీవి అపార నమ్మకం పెట్టుకోవడంతో బాబి ఇప్పుడా కథపై పడ్డాడు. చిరంజీవి స్టయిల్, మాస్ ఇమేజ్ కు తగ్గట్టు స్క్రీన్ ప్లే రాస్తున్నాడు. ప్రస్తుతానికి పూర్తిగా అదే పనిమీద ఉన్న బాబి.. లాక్ డౌన్ ముగిసిన వెంటనే మరోసారి చిరంజీవిని కలిసి పూర్తిస్థాయి నెరేషన్ వినిపిస్తానంటున్నాడు.

ఓ సగటు అభిమాని చిరంజీవిని ఎలా చూడాలని అనకుంటున్నాడో తన సినిమాలో మెగాస్టార్ అలానే ఉంటాడని, ఎలాంటి ప్రయోగాలు సినిమాలో ఉండవని, పూర్తిగా చిరంజీవి మాస్ ఇమేజ్ ఆధారంగా సినిమా నడుస్తుందని చెబుతున్నాడు బాబి. చిరంజీవి సినిమాలు చూసి, మూవీస్ పై ప్రేమ పెంచుకొని దర్శకుడిగా మారిన తను.. చిరంజీవిని డైరక్ట్ చేస్తే తన జీవితాశయనం తీరినట్టేనని అంటున్నాడు.