ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ

అందరూ అనుకున్నదే జరిగింది. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ టీజర్ రావడం దాదాపు అసాధ్యం అని అంతా ముందే గెస్ చేశారు. అటు మేకర్స్ కూడా పరోక్షంగా అదే విషయాన్ని బయటపెడుతూ వచ్చారు. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజుకు కనీసం ఆర్ఆర్ఆర్ నుంచి చిన్న పోస్టర్ అయినా ఉంటుందని ఆశించిన అభిమానులకు భంగపాటు ఎదురైంది.

అవును.. ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఆర్ఆర్ఆర్ నుంచి ఎలాంటి సందడి ఉండదని యూనిట్ క్లియర్ కట్ గా చెప్పేసింది. టీజర్ ను మాత్రమే అందించాలని గట్టిగా ప్రయత్నించినప్పటికీ లాక్ డౌన్ కారణంగా కుదరలేదని, ఇలాంటి టైమ్ లో పోస్టర్ విడుదల చేసి మమ అనిపించలేమని యూనిట్ తెలిపింది. టీజర్ ఎప్పుడు రెడీ అయితే అప్పుడు వెంటనే రిలీజ్ చేస్తామని, అప్పుడే అసలైన పండగ మొదలవుతుందని తెలిపింది.

అటు ఎన్టీఆర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తూ లేఖ విడుదల చేశాడు. లాక్ డౌన్ కారణంగా ఆర్ఆర్ఆర్ నుంచి టీజర్ రావడం లేదని, అభిమానులంతా ఇళ్లలోనే ఉండాలని, బయటకొచ్చి బర్త్ డే సెలబ్రేషన్స్ చేయొద్దని విజ్ఞప్తిచేశాడు. ఇటు తారక్, అటు యూనిట్ ప్రకటనతో.. బర్త్ డేకు 2 రోజుల ముందే టీజర్ రాదనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. దీంతో అభిమానులిప్పుడు ఆర్ఆర్ఆర్ ఫ్యాన్ మేడ్ పోస్టర్లపై పడ్డారు. తమ క్రియేటివిటీ మొత్తం చూపిస్తూ పోస్టర్లు తయారుచేస్తున్నారు.