త్రివిక్రమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తాడా?

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి తర్వాతే పవన్ సినిమాల నుంచి తప్పుకున్నాడు. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. ఇప్పుడు పవన్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. చకచకా సినిమాలు చేస్తున్నాడు. కానీ త్రివిక్రమ్ మాత్రం సైలెంట్ అయ్యాడు. ఏంటి సంగతి?

త్రివిక్రమ్ కు పవన్ ఛాన్స్ ఇవ్వలేదా? వీళ్లిద్దరి కాంబోలో ఇక సినిమా రాదా? ఇలా చాలా చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో. కానీ వాస్తవం ఏంటంటే.. సినిమాలతో సంబంధం లేకుండా పెనవేసుకున్న బంధం ఇది. పవన్ కు అత్యంత ఆప్తుల్లో ఒకడు త్రివిక్రమ్. కాబట్టి.. అజ్ఞాతవాసి డిజాస్టర్ ప్రభావం వీళ్ల ఫ్రెండ్ షిప్ ను పెద్దగా ప్రభావితం చేయలేదనే చెప్పాలి.

నిజానికి త్రివిక్రమ్ సినిమా చేయాలనుకుంటే పవన్ తో వెంటనే చేయొచ్చు. కానీ అతడికి ఉన్న కమిట్ మెంట్స్ చాలా ఎక్కువ. వెంటనే ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలి. ఆ తర్వాత లిస్ట్ లో చిరంజీవి, వెంకటేశ్ లాంటి సీనియర్లున్నారు. మధ్యలో బన్నీ లాంటి యంగ్ స్టర్లు మరోసారి సీన్ లోకి ఎంటరైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అటు పవన్ మాత్రం త్రివిక్రమ్ కు ఎప్పుడంటే అప్పుడు కాల్షీట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడట. మంచి పాయింట్ తో వస్తే, ఆల్రెడీ అనుకున్న సినిమాను కూడా పక్కనపెట్టి త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి పవన్ రెడీ అంటున్నాడట. సో.. ప్రస్తుతం వినిపిస్తున్న గాసిప్స్ బట్టి చూస్తే, త్రివిక్రమ్ ఏ క్షణానైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అది ఎప్పుడదనేది ప్రస్తుతానికి సస్పెన్స్.