కేంద్ర ప్యాకేజీపై కేసీఆర్ కస్సుబుస్సు

  • అంతా అంకెల గారడీనే
  • సీఎం కేసీఆర్

కరోనా సంక్షోభం నుంచి ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ అంతా పచ్చి మోసమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ప్యాకేజీ పేరుతో కేంద్రం తన పరువు తానే తీసుకుందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. అసలు ప్యాకేజీని అమలు చేసే విధానం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. సోమవారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన కేబినెట్ భేటీ అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కేంద్రం అనుసరిస్తున్న విధానం సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించేలా ఉందని మండిపడ్డారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ అత్యంత దుర్మార్గమైనది.. అది నియంతృత్వ ధోరణిని తెలియజేస్తోందని కేసీఆర్ వాపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రాల ద్వారా అనేక పద్దతుల్లో ప్రజల దగ్గరకు నగదు చేరుతుంది. దీనివల్ల కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందన్నారు.

అయితే ఎఫ్ఆర్‌బీఎం పరిధి పెంచమని మేం అడిగితే.. ప్రజలపై పన్నులు వేసి, సంస్కరణలు అమలు చేస్తే ఇస్తామంటున్నారు. అసలు ఇదేం పద్దతని కేసీఆర్ దుయ్యబట్టారు. ఎఫ్ఆర్‌బీఎంను 2 శాతం పెంచారు. దీంతో రాష్ట్రానికి రూ.20 వేల కోట్లు వస్తాయి. ఈ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టాల్సి వస్తుంది. ఇదేం ప్యాకేజీ.. అంతా అంకెల గారడీలా ఉంది. అయినా ఇదేం సమాఖ్య స్పూర్తి. రాష్ట్రాలతో వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని కేసీఆర్ అన్నారు.

కేంద్రం మెడమీద కత్తి పెట్టినా సరే విద్యుత్ సంస్కరణలు మాత్రం అమలు చేయబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. అన్నీ ప్రైవేటుపరం చేస్తే ఇక మనకేం మిగులుతాయని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేయకుండానే.. దేనికైనా తట్టుకొని నిలబడతామని కేసీఆర్ చెప్పారు.