అమరావతి కుంభకోణాలు… టీడీపీ నేత అరెస్ట్

అమరావతి పరిధిలో జరిగిన అక్రమాలను సిట్ ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది. రైతులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన సిట్ అధికారులు టీడీపీ నేత ఒకరిని అరెస్ట్ చేశారు.

అమరావతి పరిధిలోని నెక్కళ్లు గ్రామంలో టీడీపీ నేత రావెల గోపాల కృష్ణ తప్పుడు పత్రాలతో తమ భూమిని కాజేశారంటూ స్థానిక రైతులు తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో ఇటీవల ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన సిట్ అధికారులు …. టీడీపీ నేత గోపాలకృష్ణ అక్రమాలకు పాల్పడినట్టు తేల్చారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

గోపాలకృష్ణ తప్పుడు పత్రాలు సృష్టించి తనది కాని భూమిని రాజధానిలో ఉన్నట్టు చూపించి ప్లాట్లు తీసుకున్నాడు. అసలైన రైతులకు మాత్రం సీఆర్‌డీఏలో తక్కువ భూమి ఉన్నట్టు రికార్డుల్లో చూపించి మోసం చేశారు.

ఈ మోసంపై సిట్ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఉదంతాలు అమరావతి ప్రాంతంలో మరిన్ని ఉన్నాయని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.