Telugu Global
National

గాయపడ్డ తండ్రిని సైకిల్‌పై ఇంటికి చేర్చిన 13 ఏళ్ల బాలిక

కరోనా సంక్షోభంతో కేంద్రం విధించిన లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఎంతో మంది తమ సొంతూర్ల నుంచి దూరంగా ఉండిపోయారు. కాలి నడకన, బస్సులు, ట్రక్కులు, రైళ్లలో ఎవరికి తోచిన విధంగా వాళ్లు సొంతూర్ల వైపు సాగిపోతున్నారు. చాలా మంది తమ వారిని చేరుకోవాలని దేనికైనా తెగించి… స్వంత ఇంటికి చేరుకోవాలని భావిస్తున్నారు. ఒకే ట్రక్కులో వందల మంది కిక్కిరిసి వెళ్తున్నారు. వేల కిలోమీటర్లు నడుస్తున్నారు. కాళ్ళు నెత్తుర్లు కారుతున్నా ఆగకుండా నడుస్తూనే ఉన్నారు. సైకిళ్ళ మీద వేల […]

గాయపడ్డ తండ్రిని సైకిల్‌పై ఇంటికి చేర్చిన 13 ఏళ్ల బాలిక
X

కరోనా సంక్షోభంతో కేంద్రం విధించిన లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఎంతో మంది తమ సొంతూర్ల నుంచి దూరంగా ఉండిపోయారు. కాలి నడకన, బస్సులు, ట్రక్కులు, రైళ్లలో ఎవరికి తోచిన విధంగా వాళ్లు సొంతూర్ల వైపు సాగిపోతున్నారు. చాలా మంది తమ వారిని చేరుకోవాలని దేనికైనా తెగించి… స్వంత ఇంటికి చేరుకోవాలని భావిస్తున్నారు.

ఒకే ట్రక్కులో వందల మంది కిక్కిరిసి వెళ్తున్నారు. వేల కిలోమీటర్లు నడుస్తున్నారు. కాళ్ళు నెత్తుర్లు కారుతున్నా ఆగకుండా నడుస్తూనే ఉన్నారు. సైకిళ్ళ మీద వేల కిలో మీటర్లు వెళ్తున్నారు. చచ్చినా బతికినా స్వంత ఊర్లోనే అనే భావన వాళ్ళను ప్రాణాలకు తెగించి నడిపిస్తోంది.

ఈ క్రమంలో ఒక 13 ఏళ్ళ బాలిక గాయపడి నడవలేని స్థితిలో ఉన్న తన తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకొని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1200 కిలోమీటర్లు 7 రోజుల పాటు ప్రయాణించి ఇంటికి చేర్చింది.

బీహార్‌లోని దర్భంగాకు చెందిన 13 ఏళ్ళ జ్యోతి తన తండ్రితో కలిసి ఢిల్లీ శివార్లలోని గుర్గావ్‌లో ఉంటోంది. తండ్రి ఢిల్లీలో కిరాయికి తీసుకొని ఈ-రిక్షా నడిపిస్తాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా పని లేకుండా పోయింది. దీంతో రిక్షాకు రోజు కూలీ చెల్లించలేక యజమానికి అప్పగించేశాడు. ఆనాటి నుంచి ఆదాయం లేక వారికి తిండి కరువయ్యింది. అద్దె కోసం వాళ్ళు ఉండే ఇంటి యజమాని ప్రతీ రోజు ఒత్తిడి చేయసాగాడు.

దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో బీహార్ లోని తమ స్వంత ఊరికి పోవాలని నిర్ణయించుకున్నారు. ట్రక్కులో వెళ్దామనుకుంటే ట్రక్కు డ్రైవర్ 6 వేల రూపాయలడిగాడు. కానీ వాళ్ళదగ్గరున్నది 600 రూపాయలే. అందుకని ఆమె సెకండ్ హాండ్‌లో కొన్న సైకిల్ మీద వెళ్దామని అనుకున్నారు. కాలికి గాయం వల్ల‌ జ్యోతి తండ్రి సైకిల్ నడపలేడు. ఇక జ్యోతి తానే సైకిల్ తొక్కాలని నిర్ణయించుకొని తండ్రిని తీసుకొని బయలు దేరింది. మే 10 వతేదీన గుర్గావ్ లో బయలు దేరి మే 16 న తమ ఊరికి చేరుకున్నారు.

జ్యోతి తన ప్రయాణం గురించి ఏమంటుందంటే…ʹʹ రాత్రి వేళల్లో సైక్లింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను భయపడలేదు, ఎందుకంటే వందలాది మంది వలసకూలీలు హైవేలపై నడుస్తూనే ఉన్నారు. మా ఏకైక ఆందోళన రోడ్డు ప్రమాదాలు. అదృష్టవశాత్తూ మేము ఏ ప్రమాదానికి గురికాకుండా చేరుకున్నాము. నా తండ్రి ఢిల్లీలో ఈ-రిక్షాను నడిపేవాడు. లాక్ డౌన్ అయిన తరువాత రిక్షాను దాని యజమానికి అప్పగించేశాం. దానితో నాన్నకు పని లేకుండా పోయింది. పైగా నాన్న‌ కాలికి గాయమైంది.ʹʹ

ʹʹమాకు పెద్దగా డబ్బు లేదు… మేము ఉండే గది కిరాయి చెల్లించాల‌ని లేదా ఖాళీ చేయమని గది యజమాని నాన్నపై ఒత్తిడి తెచ్చాడు. మాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. అందువల్ల‌ మేము మా గ్రామానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాము. మేము ఒక ట్రక్ డ్రైవర్‌తో మాట్లాడాము, మమ్మల్ని ఢిల్లీ నుండి దర్భంగాకు తీసుకురావడానికి 6,000 రూపాయలు డిమాండ్ చేశారు. మా దగ్గర అంత సొమ్ము లేదు. చివరగా నేను 500 రూపాయలతో కొన్న సైకిల్ పై నేను, నాన్నప్రయాణం ప్రారంభించాముʹʹ అంది జ్యోతి.

జ్యోతి మరియు ఆమె తండ్రి ఢిల్లీ నుండి బయలుదేరినప్పుడు వాళ్ళ దగ్గర‌ కేవలం 600 రూపాయలు మాత్రమే ఉన్నాయి. జ్యోతి పగలు రాత్రి సైకిల్ తొక్కేది.. రాత్రి వేళల్లో పెట్రోల్ పంపుల దగ్గర‌ 2-3 గంటలు విరామం తీసుకునేది. రోడ్ల మీద సహాయ శిభిరాల్లో ప్రజలు అందించిన ఆహారంతో కడుపు నింపుకున్నారు. వారం రోజులు సైకిల్ తొక్కుకుంటూ 1200 కిలోమీటర్లు విరామం లేకుండా ప్రయాణించి చివరకు క్షేమంగా స్వగ్రామానికి చేరారు. వాళ్ళను గ్రామ గ్రంథాలయంలో క్వారంటైన్ లో ఉంచారు.

చిన్నారి జ్యోతి అంత దూరం సైకిల్ తొక్కుకుంటూ తండ్రిని తీసుకొని వచ్చిదంటే కుటుంభ సభ్యులు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని జ్యోతి బావ ముఖేష్ పాస్వాన్ అంటున్నాడు.

First Published:  20 May 2020 8:06 AM GMT
Next Story