విడాకులపై మరోసారి స్పందించిన హీరో

హీరో మంచు మనోజ్ విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తను, తన భార్య విడిపోయామనే విషయాన్ని మంచు మనోజ్ అధికారికంగా ప్రకటించాడు కూడా. ఈరోజు అతడి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకులపై మరోసారి స్పందించాడు ఈ మంచు హీరో.

“విడాకుల గురించి దాచడనికి ఏమీ లేదు. నేను నిజాయితీగా ఉండే మనిషిని, మనసులో ఏది ఉంటే అదే బయటికి మాట్లాడతాను. ఇక డైవోర్స్ అంటారా ఎవరి జీవితంలోనైనా ఏవో కొన్ని సమస్యలు ఉంటూనే ఉంటాయి. నా జీవితంలో కూడా కొన్ని సమస్యలున్నాయి. వాటిని మనకు మనమే ఎదిరించి నిలబడాలి. నేనూ అదే చేశాను.”

వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ఎదురైన ఫెయిల్యూర్స్ ను అధిగమించేందుకు ఒంటరిగా చాలా ప్రదేశాలు తిరిగానని చెప్పుకొచ్చాడు మనోజ్. ట్రెక్కింగ్ చేశానని, కొన్ని లాంగ్ టూర్స్ కు కూడా వెళ్లి ఒంటరిగా గడిపానని అన్నాడు. తన ఇష్టదైవం శివుడని, అలా ఆధ్యాత్మికంగా కూడా కొంత సమయం గడిపానని వెల్లడించాడు. అలా మానసికంగా పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి సినిమాల్లోకి వచ్చినట్టు తెలిపాడు.

ప్రస్తుతం తనే నిర్మాతగా అహం బ్రహ్మస్మి అనే సినిమా చేస్తున్నాడు మంచు మనోజ్. దీన్ని పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నట్టు వెల్లడించాడు. సినిమాలో ఒక్క ఫైట్ కోసమే 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, దీన్ని బట్టి తన సినిమా క్వాలిటీ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అంటున్నాడు.