అఫీషియల్ పేజీ కంటే ఈ ఫొటోకే ఎక్కువ క్రేజ్

ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఎన్టీఆర్ నుంచి ఎలాంటి టీజర్ ఉండదని 2 రోజుల కిందటే యూనిట్ స్పష్టంచేసింది. అక్కడితో ఆగకుండా ఫస్ట్ లుక్ లాంటివి కూడా ఉండవని క్లారిటీ ఇచ్చేసింది. ఈరోజు ఆర్ఆర్ఆర్ యూనిట్ నుంచి ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాంకాక్షలు తెలిపారు. ఏదో ఒక ఫొటో పెట్టాలి కాబట్టి.. తారక్ కు సంబంధించి ఓ స్టిల్ (బహుశా ఆన్ లొకేషన్ పిక్ అయి ఉండొచ్చు) షేర్ చేసి విశెష్ చెప్పింది. అయితే యూనిట్ పెట్టిన ఈ ఫొటో కంటే.. రామ్ చరణ్ పోస్ట్ చేసిన ఫొటోకే ఎక్కువ క్రేజ్ వచ్చింది.

సింపుల్ గా ఓ రెగ్యులర్ ఫొటో పోస్ట్ చేసి వదిలేసింది ఆర్ఆర్ఆర్ యూనిట్. కానీ ఎన్టీఆర్ తో కలిసి తను దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు చరణ్. వీళ్లిద్దరి మధ్య అనుబంధం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ స్టిల్ ఒక్కటి చాలు. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడానికి ఉదాహరణగా నిలిచింది ఈ ఫొటో. ప్రస్తుతం ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ఆ ఫొటోను ఎక్కడ తీశారు.. అప్పుడు సందర్భం ఏంటనే విషయాన్ని చరణ్ బయటపెట్టలేదు. ఫొటో చూస్తే మాత్రం ఆర్ఆర్ఆర్ టైమ్ లో తీసిందే అనే విషయం అర్థమౌతోంది. బహుశా ఓ ఏడాది కిందట చేసిన పూణె షెడ్యూల్ లో ఆ ఫొటో తీసి ఉంటారేమో.