ఆ సినిమా మరోసారి ఓకే అయింది

ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి ఎలాంటి సందడి లేదు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ అప్ డేట్ కూడా లేదు. కానీ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తారక్ చేయబోయే సినిమాపై మాత్రం మరోసారి క్లారిటీ వచ్చేసింది. అవును.. కేజీఎఫ్2 తర్వాత తను ఎన్టీఆర్ తో వర్క్ చేయబోతున్నాననే విషయాన్ని పరోక్షంగా వెల్లడించాడు ప్రశాంత్.

ఈరోజు ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు అందజేశాడు నీల్. అందులోనే తారక్ ను న్యూక్లియర్ ప్లాంట్ తో పోల్చాడు. త్వరలోనే దాని పక్కన కూర్చోబోతున్నానని ప్రకటించాడు. మరోవైపు ఇదే విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించింది.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ వర్క్ మీద ఉన్నాడు ఎన్టీఆర్. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా ఎప్పటికి పూర్తవుతుందో అప్పుడే ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఇది పూర్తయి, థియేటర్లలోకి వచ్చిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తాడు ఎన్టీఆర్. అది కూడా పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా పాన్-ఇండియన్ మూవీగా రాబోతోంది. ఈ సినిమా కోసం 150 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకుంటున్నారట.