కరోనా పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణలో కరోనా పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు చేయించుకోవడాన్ని ప్రభుత్వం అడ్డుకోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లి పరీక్షలు చేయించుకునే హక్కు ప్రజలకు ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఐసీఎంఆర్‌ ఆమోదించిన ప్రైవేట్ ల్యాబులలో కరోనా పరీక్షలకు అనుమతించాలని ఆదేశించింది. గాంధీ, నిమ్స్‌ ఆస్పత్రుల్లోనే పరీక్షలు చేయించుకోవాలని చెప్పే హక్కు ప్రభుత్వానికి లేదని వ్యాఖ్యానించింది. ఇలా తాము చెప్పిన చోటే పరీక్షలు చేయించుకోవాలని చెప్పడం రాజ్యాంగ విరుద్దమని హైకోర్టు తేల్చిచెప్పింది.

లాక్‌డౌన్ సడలింపులతో కరోనా మరింత విజృంభించే అవకాశాలున్నాయని… ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ ల్యాబ్‌లు, ఆస్పత్రుల సేవలను వాడుకోకుండా ప్రభుత్వం మాత్రమే ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కొంటుందని హైకోర్టు ప్రశ్నించింది.

ప్రభుత్వం ప్రస్తుతం కేవలం కరోనా లక్షణాలున్న వారికి మాత్రమే పరీక్షలు చేస్తోందని… సామాన్యులు ఎవరైనా వారికి వారుగా ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకుంటే ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించింది. ప్రజలే వారికి వారుగా డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రైవేట్ సేవలు తీసుకుంటామంటే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని ప్రభుత్వాన్ని నిలదీసింది. పైగా ప్రభుత్వంపై ఉచిత వైద్య భారం తగ్గుతుంది కదా అని అభిప్రాయపడింది.

ప్రైవేట్ ల్యాబ్‌లకు అనుమతి ఇస్తే కరోనా కేసులను దాచిపెడుతారంటూ ప్రభుత్వం చేసిన వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ప్రైవేట్ ల్యాబులపైనా, ప్రైవేట్ ఆస్పత్రులపైనా ప్రభుత్వానికి నమ్మకం లేకపోతే మరి ఆరోగ్య శ్రీ సేవల విషయంలో మాత్రం ప్రైవేట్ ఆస్పత్రులను ఎందుకు అనుమతించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ప్రైవేట్ ల్యాబుల్లో, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు, వైద్యం చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. అయితే కరోనా సేవలు అందించాలనుకునే ల్యాబులు, ప్రైవేట్ ఆస్పత్రులు తప్పనిసరిగా ఐసీఎంఆర్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. గుర్తించిన ప్రైవేట్ ల్యాబులు, ఆస్పత్రులను నోటిఫై చేయాలని హైకోర్టు సూచించింది. వీలైనంత త్వరగా గుర్తించిన ప్రైవేట్ ల్యాబులు, ప్రైవేట్ ఆస్పత్రులను నోటిఫై చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.